రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయండి

Opposition toils to form coalition against TRS - Sakshi

గవర్నర్‌కు ప్రతిపక్షాల డిమాండ్‌

రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు

ఉత్తమ్‌ నేతృత్వంలో నరసింహన్‌ను కలసి వినతిపత్రం అందజేత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ప్రతిపక్షాలు గవర్నర్‌ను డిమాండ్‌ చేశాయి. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటర్ల జాబితా తయారవుతున్న సమయంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించాయి. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు మంగళవారం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఉత్తమ్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్‌ నేతలు కె. జానారెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, ఆ పార్టీ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, కె. సాంబశివరావు తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలిశాక ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో చట్టాలకు పాతర
తెలంగాణలో చట్టాలకు కేసీఆర్‌ పాతరేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. కేసీఆర్‌ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అంతిమంగా ప్రజలే కేసీఆర్‌కు ఘోరీ కడుతారు. – చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  
వ్యతిరేకత పెరుగుతోందనే ముందస్తుకు...
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కొనసాగిస్తే ఆయన అరాచకాలకు, ఎన్నికల అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉంది. ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించే ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. తద్వారా దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.– కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

మోదీ, కేసీఆర్‌ ప్రజాహక్కుల్ని కాలరాస్తున్నారు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉంటే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకం లేదు. ప్రధాని మోదీతోపాటు కేసీఆర్‌ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఓటర్ల జాబితా సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తు ఎన్నికలంటూ అసెంబ్లీని రద్దు చేసి కొత్త ఓటర్లు ఓటేయకుండా కేసీఆర్‌ అడ్డుపడ్డారు. ఎన్నికల సంఘం ప్రకటించాల్సిన షెడ్యూల్‌ను కేసీఆర్‌ ప్రకటించారంటేనే కేంద్రంతో కలసి ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారని అర్థమవుతోంది.

హైదరాబాద్‌ జంట నగరాల్లో ఓటర్లను అకారణంగా తొలగించారు. కేసీఆర్‌ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటారు. 2004లోనే కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావుపై దొంగ పాస్‌పోర్టు కేసులు నమోదైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు. పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ కేసీఆర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన దామోదర రాజనర్సింహను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. పోలీసుల బెదిరింపులకు భయపడం. తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌

ఇష్టారాజ్యంగా సీఎం నిర్ణయాలు
ఐదేళ్లు పాలించాలని ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే కేసీఆర్‌ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టుతున్నారు. రాజ్యాంగ సంస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్‌ నయా పెత్తందారీ అవతారమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత సృష్టించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ను వెంటనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించాలి. రాష్ట్రంలో ఎన్నికలు సవ్యంగా సాగాలంటే రాష్ట్రపతి పాలన విధించడమే శరణ్యం. – ఎల్‌. రమణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top