లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

Om Birla to be new Lok Sabha Speaker, Opposition to support BJP - Sakshi

ఎన్డీయే అభ్యర్థిగా కోట ఎంపీ

తీర్మానానికి ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్‌సీపీ మద్దతు

బిర్లాకే తమ మద్దతన్న కాంగ్రెస్‌ సహా యూపీఏ పక్షాలు

నేడు లాంఛనంగా ఎన్నిక

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. బుధవారం స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ, అలాగే ఆయన ఎన్నిక కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు గాను ఇప్పటికే లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్‌ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి.

దిగువ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉండటం, అంతేగాక యూపీఏ పక్షాలు సైతం బిర్లాకే మద్దతు ప్రకటించడంతో స్పీకర్‌గా ఆయన ఎన్నిక ఇక లాంఛనం మాత్రమే. స్పీకర్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. కాగా కాంగ్రెస్‌తో పాటు మిగతా యూపీఏ పక్షాలు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి మంగళవారం చెప్పారు. సాయంత్రం జరిగిన యూపీఏ పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్‌ అంశంపై మాత్రం ఆయన మౌనం వహించారు. కాంగ్రెస్, విపక్షాలు దీనిపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.  

మోదీ చాయిస్‌!
స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా లోక్‌సభ స్పీకర్‌ పదవి విషయంలో సీనియర్‌ నేతలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మొదటిసారిగా లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైనా మురళీ మనోహర్‌ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు.

అయినప్పటికీ బిర్లాను బీజేపీ స్పీకర్‌ పదవికి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యకరమేనని చెప్పాలి. వరసగా రెండోసారి అధికారం చేపట్టిన ఉత్సాహంలో ఉన్న మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు మరోసారి తమ మార్క్‌ ప్రదర్శించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పార్టీలో కానీ, చట్టసభల్లో కానీ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలు 17వ లోక్‌సభకు స్పీకర్‌గా బిర్లాను ఎంపిక చేయడం ద్వారా బలంగా పంపారని అంటున్నారు. అలాగే పైకి కన్పించకపోయినా క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసేవారికి పార్టీ ప్రాధాన్యమిస్తుందనడానికి కూడా ఇది సంకేతమని చెబుతున్నారు.

రెండుసార్లు ఎంపీ
రాజస్తాన్‌లోని కోట–బూందీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 57 ఏళ్ల బిర్లా మొత్తం మీద రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్పీకర్‌గా ఎన్నికైతే ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన సుమిత్రా మహాజన్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బిర్లా బీజీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందినవారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ యూనియన్‌ నాయకుడిగా ఉండగానే ఆయనలో తెలివితేటలు, సృజనాత్మకత బీజేపీ పెద్దలకి అర్థమయ్యాయి. 2003లో మొట్టమొదటిసారిగా కోట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చురుకైన నేతగా, అప్పగించిన పని కంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియమ నిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. స్పీకర్‌ పదవికి బిర్లా  అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నినాదాలు .. వాగ్వాదాలు
రెండోరోజు సోనియా, ములాయం ప్రమాణం
లోక్‌సభ సమావేశాల రెండోరోజు మంగళవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ తదితరులు సభ్యులుగా ప్రమాణంచేశారు. సభ్యుల ప్రమాణం సందర్భంగా అధికార, విపక్షాల సభ్యులు పెద్దయెత్తున నినాదాలతో పోటీపడ్డారు. సోనియా హిందీలో ప్రమాణం చేస్తుండగా విపక్ష బెంచీల్లో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరిస్తూ కన్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే.. మరోవైపు బీజేపీ సభ్యులు సోనియా హిందీలో ప్రమాణం చేసినందుకు అభినందించడం విన్పించింది.

ఆ తర్వాత వెంటనే బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ప్రమాణం చేయగా సోనియా, మేనక ఇద్దరూ ముకుళిత హస్తాలతో ఒకరినొకరు పలుకరించుకున్నారు. కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ తోడురాగా అస్వస్థత కారణంగా వీల్‌ చైర్‌లో సభలోకి వచ్చిన 79 ఏళ్ల ములాయంను ఆయన సీట్లోనుంచే ప్రమాణం చేసేందుకు అనుమతించారు. కాగా ఓం బిర్లా సభలో ప్రవేశించినప్పుడు, ఆయన ప్రమాణం చేసేందుకు లేచినప్పుడు చప్పట్లు మార్మోగాయి. కొత్తగా ఎన్నికైనా సభ్యులు కొందరు చేసిన నినాదాలు సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీశాయి.

ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు నినదించడంతో.. నినాదాలేవీ రికార్డుల్లోకి వెళ్లవని ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. విపక్షాల సభ్యులు ముఖ్యంగా టీఎంసీ ఎంపీలు ప్రమాణ స్వీకారానికి లేచినప్పుడు బీజేపీ సభ్యులు ‘భారత్‌ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్‌’అంటూ నినదించారు. ఇందుకు ప్రతిగా టీఎంసీ నేతలు ‘జై మా దుర్గ’, ‘జై బెంగాల్‌’, ‘జై మమత’, ‘జై హింద్‌’అంటూ నినాదాలు చేశారు. ఒకదశలో రాహుల్‌ ‘మరొక్కసారి’, ‘మరొక్కసారి’అని బీజేపీ సభ్యులనుద్దేశించి అన్నారు. కాగా నటుడు, మొదటిసారి ఎంపీ సన్నీ డియోల్‌ ప్రమాణంలోని ‘అప్‌హోల్డ్‌’పదాన్ని ‘విత్‌హోల్డ్‌’గా చదివి ఆ తర్వాత సరిదిద్దుకున్నారు.  

ఒవైసీ ‘జై భీమ్‌ .. అల్లాహు అక్బర్‌’
అధికార పక్ష సభ్యులు ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతాకీ జై’, ‘వందేమాతరం’అంటూ నినదించడంతో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ‘జై భీమ్, జై మీమ్, తక్బీర్‌ అల్లాహు అక్బర్, జై హింద్‌’అని అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్‌ ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’అంటూ నినదించి అధికార పక్ష సభ్యులతో వాదులాటకు దిగారు.


ఎంపీగా ప్రమాణం చేస్తున్న సోనియాగాంధీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top