డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు

OkCupid Study: Political Influence Dating - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్నార్సీ) లాంటి వివాదాస్పద అంశాలు ఈ తరం యువతీ యువకుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వారి మధ్య డేటింగ్‌కు కొంత మేరకు అడ్డు గోడలుగా నిలుస్తున్నాయి. ఈ చట్టాలతో విభేదిస్తున్న వారితో డేటింగ్‌ చేస్తారా? అని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డేటింగ్‌ ఆప్‌ ‘ఓకేకుపిడ్‌’ ప్రశ్నించగా నిరభ్యంతరంగా డేటింగ్‌ చేస్తామని మెజారిటీ మగవాళ్లు చెప్పగా, చేస్తామని చాలా తక్కువ మంది మహిళలు చెప్పారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు యువతీ, యువకుల డేటింగ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ‘ఓకేకుపిడ్‌’ సంస్థ రెండు లక్షల మంది యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది.

సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకించేవారితో డేటింగ్‌ చేస్తారా ? అన్న ప్రశ్నకు 56 శాతం మంది యువకులు చేస్తామని చెప్పగా, 20 శాతం మంది చెప్పలేమని, 24 శాతం మంది ఏదని కచ్చితంగా చెప్పలేమని చెప్పారు. అదే ప్రశ్న యువతులను అడగ్గా చేస్తామని 39 శాతం మంది, చేయమని 30 శాతం మంది, చెప్పలేమని 31 శాతం మంది తెలిపారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై చర్య తీసుకోవడం సమంజసమా ? అని ప్రశ్నించగా, 18 శాతం మంది మగవాళ్లు సమంజసమని, 21 శాతం మంది కాదని, కొన్ని కేసుల్లో మాత్రమే చర్య తీసుకోవచ్చని 37 శాతం మంది, ఏం చెప్పలేమని 18 శాతం మంది చెప్పారు. అదే యువతుల్లో 14 శాతం మంది సమంజసమని, 31 శాతం మంది కాదని, కొన్ని కేసుల్లో సమంజసమని 36 శాతం మంది, ఎటూ చెప్పలేమని 19 శాతం మంది చెప్పారు.

డేటింగ్‌ సమయంలోగానీ, డిన్నర్‌ టేబుల్‌పైగానీ, బెడ్‌ రూముల్లో గానీ తమ భాగస్వామితో రాజకీయాలు మాట్లాడమని సహస్రాబ్ద యువతీ యువకుల్లో 60 శాతానికి పైగా చెప్పారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా, సెక్స్‌కు ప్రాధాన్యత ఇస్తారా? అని ప్రశ్నించగా, మెజారిటీ యువతీ యువకులు ‘గుడ్‌ సెక్స్‌’కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన యువతీ, యువకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా చెప్పారు. రాజకీయాల విషయమై ఏకీభావం కుదిరితేనే డేటింగ్‌ అయినా, పెళ్లయినా అని 70 శాతం మంది చెప్పారు. రాజకీయ విభేదాలుంటే కలిసి ఉండడం కష్టమని వారు చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top