రాష్ట్రంలో టీడీపీ దుకాణం బంద్‌

No Future For TDP In Telangana - Sakshi

దేశానికి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం

రానున్న రోజులు సీపీఎంవే

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సాక్షి, హన్మకొండ అర్బన్‌: రాష్ట్రంలో టీడీపీ దుకాణం బంద్‌ అయిందని, రానున్న రోజులు దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిష్టులవే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హన్మకొండ వడ్డేపల్లి రోడ్డులోని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీపీఎం ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి యువజన సమ్మేళనానికి వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ధన బలంతో అధికారంలోకి వచ్చిందన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. సచివాలయం కూల్చివేతను అన్ని వర్గాలవారు వ్యతిరేకించాలని కోరారు. ముఖ్యంగా యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాములు, జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, నాయకులు జగదీష్, విజయ్, కోట రమేష్, బీరెడ్డి సాంబశివ, టి.ఉప్పలయ్య, తిరుపతి, రాగుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రత్యామ్నాయం చూపాలి.. 
ప్రత్యమ్నాయం చూపకుండా దళితుల భూముల్ని లాక్కోవడం అన్యాయమని తమ్మినేని అన్నారు. హన్మకొండ న్యూశాయంపేటలోని దళితుల భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణానికి తీసుకోవడాన్ని నిరసిస్తూ, తమ భూమి తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్‌ స్మృతి వనం వద్ద దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలకు వీరభద్రం సంఘీభావం తెలిపారు.

అప్పటి ప్రభుత్వం పేదల క్షేమం కోరి వారి అభ్యున్నతికి భూములు ఇస్తే ఆ భూమిని ఎలాంటి చర్చలు జరుపకుండా వారికి ప్రత్యమ్నాయ మార్గం చూపకుండా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడంత ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  కాజీపేట మండల కార్యదర్శి యు.నాగేశ్వర్‌రావు, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య, ప్రజా సంఘాల నాయకులు ఎండీ ఖాసీం,  రమేశ్,  సారంగపాణి,  రవికుమార్‌ సంఘీభావం తెలిపారు. బాధితులు ఎం.కుమార్, కె.భిక్షపతి, వి.మల్లేశం, కె.శివ, బి.దయాకర్, సి.హచ్‌.శివశంకర్, జి.పద్మ, వి.మేరి, కళావతి, కె.సరిత, ఎం.రాజమణి, ఎం.వనమాల పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top