‘సొంత పార్టీలో సెగ.. ప్రధాని రాజీనామాకు పట్టు’

Nepal Ruling Party Leaders Demand PM Oli Resignation - Sakshi

ఖాట్మాండు: భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపాల్‌ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నేపాల్‌లోని అధికార పక్షమైన కమ్యూనిస్టు పార్టీ డిమాండ్‌ చేస్తోంది. పార్టీ చైర్మన్‌ పుష్ప కమల్ దహల్ కూడా ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయడం నేపాల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్‌ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్‌ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ఆదివారం ప్రధాని ఓలీ ఆరోపించారు. (నన్ను గద్దె దింపేందుకు కుట్ర: నేపాల్‌ ప్రధాని)

నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. దీనికి అధికార పార్టీ సభ్యులతో పాటు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పదవి నుంచి తప్పించడానికి భారత్‌ కుట్రలు పన్నుతోందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావన్నారు. అనవసరంగా చిరకాల మిత్ర దేశమైన భారత్‌తో విరోధం ప్రధాని వైఫల్యమే అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అలాగే సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయడం తగదన్నారు. ప్రధాని వ్యాఖ్యలు పొరుగు దేశాలతో నేపాల్‌ సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని హెచ్చరించారు. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్‌)

పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు కూడా ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడంలో ప్రధాని ఓలీ విఫలమయ్యారని.. పార్టీ పగ్గాలను కూడా సరైన నేతలకు అప్పగించాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మొత్తం 18 మంది నాయకులు హాజరవగా 17 మంది రాజీనామాకు పట్టుబట్టినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ప్రధాని ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top