శివసేనకు షాక్‌.. శరద్‌ సంచలన ప్రకటన!

NCP, Congress do not have mandate, Says Sharad Pawar - Sakshi

ముంబై: ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరిస్తుండటంతో ఎన్సీపీ-కాంగ్రెస్‌ మద్దతుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సీఎం పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్న శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ మద్దతు కోసం సేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ నెరిపిన దౌత్యం ఫలించలేదు. ప్రభుత్వంలో చేరేది లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెగేసి చెప్పారు. ప్రజాతీర్పునకు అనుగుణంగా తాను, తన మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చుంటామని తేల్చిచెప్పారు.

‘ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలనుకోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రతిపక్షం పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. ప్రభుత్వ ఏర్పాటులో నేను భాగం కాదలుచుకోలేదు. కొన్నిరోజులపాటు నేను ముంబైలో ఉండటం లేదు. పుణె, సతారా, కరాద్‌ ప్రాంతాల్లో పర్యటించబోతున్నాను’ అని శరద్‌ బుధవారం తెలిపారు. శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగా శరద్‌తో భేటీ అయినట్టు రౌత్‌ చెప్తున్నప్పటికీ.. బీజేపీ రహిత ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోరేందుకు ఆయన పవార్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన  స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top