
సాక్షి,న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లో సహకరించినందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ అమల్లో రాష్ట్రాల పాత్ర ఆమోఘమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇక్కడి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో సాయంత్రం 4 వరకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. పోటీతత్వంతో కూడిన సమైక్య స్ఫూర్తితో అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో వనరులకు ఎలాంటి కొదవ లేదని, వాటిని సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. జన్‌ధన్ యోజన, ముద్రబ్యాంకు రుణాల పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచాయని వివరించారు. గత సమావేశ నిర్ణయాల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఆయుష్మాన్ భారత్, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు.