492 రోజులు మోదీ ప్రయాణంలోనే | Narendra Modi One Of The Most-Travelled World Leaders | Sakshi
Sakshi News home page

492 రోజులు మోదీ ప్రయాణంలోనే

Jul 30 2018 2:32 PM | Updated on Oct 4 2018 6:57 PM

Narendra Modi One Of The Most-Travelled World Leaders - Sakshi

మోదీకి మరో పది నెలలపాటు పదవీకాలం ఉండడంతో ఈలోగా ఆయన మరెన్ని దీశాలు తిరుగుతారో ఆయనకే తెలియాలి.

సాక్షి, న్యూఢిల్లీ : ఎక్కువగా విదేశాల్లో పర్యటించే ప్రపంచ దేశాధినేతల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో ఉంటారనడం జోక్‌ కాదు, నిజమన్నది మనకందరికి తెల్సిందే. ఆయన గత వారం దక్షిణాఫ్రికా, ఉగాండ, రువాండ దేశాల్లో ఐదు రోజులు పర్యటించారు. దీంతో ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 84 అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లారు. 2014, మే నెలలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే.

నరేంద్ర మోదీ తన ఆఫ్రికా పర్యటన ముగింపుతో ఢిల్లీ విడిచి దేశ విదేశాల్లో 492 రోజులు ప్రయాణంలో గడిపారు. అంటే ఆయన ఇప్పటి వరకు ప్రధానిగా పనిచేసిన కాలంలో 32 శాతం కాలాన్ని ప్రయాణంలోనే గడిపారు. ఈ విషయం పీఎంవో వెబ్‌సైట్‌లోని ఆయన ప్రయాణాల జాబితాను పరిశీలిస్తే అర్థం అవుతోంది. మోదీకి ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ మొదటి టెర్మ్‌లో 368 రోజులు, రెండో టెర్మ్‌లో 284 రోజులు ప్రయాణంలోనే గడిపారు. అప్పుడు ఎక్కువగా విదేశాల్లో ఉండే ప్రధాన మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ను సుష్మా స్వరాజ్‌ సహా పలువురు బీజేపీ నాయకులు విమర్శించారు. ఇప్పుడు మోదీ తిరుగుతుంటే ఆయన్ని విమర్శించే ధైర్యం బీజేపీ నాయకులకు ఎలాగూ లేదు కనుక ఆ బాధ్యతను ఇప్పుడు సోషల్‌ మీడియా తీసుకుంది. ‘ఉత్తమ ప్రపంచ పర్యాటకుడు’ అవార్డు ఇవ్వాల్సి వస్తే మోదీకి ఇవ్వాలంటూ సోషల్‌ మీడియాలో జోకులు కూడా వచ్చాయి.

మోదీకి మరో పది నెలలపాటు పదవీకాలం ఉండడంతో ఈలోగా ఆయన మరెన్ని దీశాలు తిరుగుతారో ఆయనకే తెలియాలి. మన్మోహన్‌ సింగ్‌ తన పదేళ్ల కాలంలో 15 రోజుల పాటు ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉన్నది కేవలం రెండుసార్లు. అదే ఇప్పటికే ఐదుసార్లు దూరంగా ఉన్నారు. మోదీ ఇప్పటి వరకు నెల మొత్తం ప్రధాని కార్యాలయానికి అందుబాటులో, అంటే ఢిల్లీలో ఉన్నది ఒక్కటి కూడా లేదు. మోదీ ఎక్కువగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే దేశీయంగా పర్యటించారు. మోదీ తన ప్రయాణ కాలంలో 101 రోజులు అనధికార పనిమీద, 12 రోజులపాటు అధికార, అనధికార పనిమీద పర్యటించినట్లు పీఎంవో వెబ్‌సైట్‌ తెలియజేస్తోంది.

మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా తన తొలి పర్యాయంలో 51 రోజలు, రెండో పర్యాయంలో 24 రోజులు అనధికార పనులపై ప్రయాణించారు. ఆయన పదేళ్ల కాలంలో పర్యటించిన దానికన్నా మోదీ ఇప్పటికే ఎక్కువ అనధికార పర్యటనలు చేశారు. ప్రధానిది అధికార పర్యటన అయినా, అనధికార పర్యటన అయినా  ఖర్చులో భారీ తేడా ఏమీ ఉండదు. అనధికార పర్యటనలో అధికారిక సమావేశాలు ఉండవు. ప్రోటోకాల్‌ అధికారులు ఉండరు. మోదీ 84 విదేశీ పర్యటనలకు మొత్తం 1,484 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement