అధికారికి బెదిరింపు కాల్‌.. సమర్థించుకున్న ఎమ్మెల్యే

Nakrekal MLA Vemula Veeresham Warning To DCCB CEO - Sakshi

సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అధికార జులుం ప్రదర్శించారు. డీసీసీబీ ఉన్నతాధికారిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపు ఒకటి వైరల్‌ అవుతోంది. సస్పెండ్‌ అయిన మహిళా ఆఫీసర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆయన ఫోన్‌లో బ్యాంకు సీఈవో మోహన్‌రావును బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనతోపాటు డీసీసీబీ చైర్మన్‌పై కూడా వీరేశం అసభ్యపదజాలం వాడారు.

ముందుగా నార్కెట్‌పల్లి ఎంపీపీ ఫోన్‌ను సీఈవో అయిన మోహన్‌రావుకు కలిపి వీరేశంకు అందించారు. ఇక అక్కడ నుంచి వీరేశం తన వాగ్దాటిని ప్రదర్శించారు. చైర్మన్‌ సోమవారం వస్తారని చెబుతున్నా వినకుండా ఎమ్మెల్యే అధికారిని తిట్టడం అందులో గమనించవచ్చు. చైర్మన్‌ అందులో సంతకం పెట్టాలని అధికారి చెబుతున్న క్రమంలో.. ఇలాంటి విషయంలో సీఈవోదే తుది అధికారం అని జీవోలో స్పష్టంగా పేర్కొని ఉందంటూ ఎమ్మెల్యే వాదనకు దిగారు. వికలాండివనే సహిస్తున్నానని.. డ్రామాలు ఆడుతున్నావా అంటూ ఎమ్మెల్యే ఆ అధికారిపై మండిపడ్డారు. 

ఫైల్‌ నంబర్‌​చెప్పాలంటూ అధికారిని బెదిరించటం... అధికారి ఛైర్మన్‌ ప్రస్తావన తేవటంతో ఆ సంగతి తనకు చెప్పొద్దని ‘నీ అయ్య జాగీరా’... అంటూ పరుష పదజాలం, ఆపై అసభ్య పదాలతో ఎమ్మెల్యే దూషించారు. చైర్మన్‌ని వెధవ అని సంభోదిస్తూ మధ్యలో సంపత్‌ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తావన తీసుకొచ్చి దుర్భషలాడారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నావన్న విషయం గుర్తుంచుకోవాలని.. కావాలంటే లంచం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఎమ్మెల్యే చెప్పటం అందులో ఉంది. సోమవారం మల్లికార్జున్‌ అనే వ్యక్తిని పంపిస్తానని.. ఖచ్ఛితంగా పని జరగకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు

కాగా, పందొమ్మిది కోట్ల ప్రజాధనం కొల్లగొట్టి సస్పెండ్ అయిన మహిళా ఉద్యోగిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ వీరేశం బెదిరించినట్లు బాధిత వ్యక్తి మోహన్‌రావు చెప్తున్నారు.

పని చేయనుందుకే బెదిరించా : ఎమ్మెల్యే

కాగా, ఈ ఫోన్‌ కాల్‌ దుమారం పై ఎమ్మెల్యే వీరేశం స్పందించారు. డీసీసీబీ అధికారిపై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ‘‘నేను సీఈఓ ను బెదిరించలేదు. పనిచేయనందుకే ప్రశ్నించాను. ప్రజలతోనే ఉంటూ, అవినీతికి, అక్రమాలకు దూరంగా ఉంటాను కాబట్టే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాను నియోజకవర్గ అధికారులతో స్నేహపూర్వకంగానే ఉంటానని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. 

మళ్లీ చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top