భూమి.. ఆకాశం.. అంతరిక్షం

My govt has conducted surgical strike in land, sky and space - Sakshi

ఎక్కడైనా సర్జికల్‌ స్ట్రైక్స్‌కు రెడీ

130 కోట్ల మంది మళ్లీ ఎన్డీయేకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు

రాహుల్‌ గాంధీకి థియేటర్‌ సెట్‌కు, ఏ–శాట్‌కు తేడా తెలియట్లేదు

విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ

మీరట్‌/న్యూఢిల్లీ/అఖ్నూర్‌/డెహ్రాడూన్‌: శత్రుదేశాలపై భూ, గగనతలం, అంతరిక్షంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం తెగువ చూపిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఎన్డీయే ప్రభుత్వానికి మరోసారి ఓటేయాలని నిర్ణయించుకున్నారన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్‌ పరీక్ష విజయవంతం కావడంపై స్పందిస్తూ.. శత్రుదేశాల నుంచి భారత్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కు థియేటర్‌ సెట్‌కు, ఏ–శాట్‌కు తేడా తెలియడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యూపీ, ఉత్తరాఖండ్, కశ్మీర్‌లో పర్యటించిన మోదీ, విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రోగ్రెస్‌ రిపోర్టును ప్రజలముందు పెడతాం..
భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఎన్డీయే ప్రభుత్వం ధైర్యంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘దమ్మున్న బీజేపీ ప్రభుత్వానికి, కళంకితులైన ప్రతిపక్షాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే మా రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచడంతో పాటు గత 60 ఏళ్లలో ప్రతిపక్షాలు ఏం చేశాయన్న విషయమై నిలదీస్తాం’ అని వెల్లడించారు. రాçహుల్‌ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్‌)పై స్పందిస్తూ..‘పేద ప్రజల చేత కనీసం బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించలేనివాళ్లు ఇప్పుడు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోకి నగదును జమచేస్తామని హామీ ఇస్తున్నారు. అంతకంటే వాళ్లేం చేయగలరు?’ అని వ్యాఖ్యానించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ఇచ్చిన గరీబీ హటావో(పేదరికాన్ని తరిమేద్దాం) నినాదాన్ని తాను చిన్నప్పటి నుంచి వింటున్నాననీ, కానీ దేశంలో పేదరికం తగ్గకపోగా పేదలు నిరుపేదలుగా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తే పేదరికం దానంతట అదే అంతమైపోతుందని వ్యాఖ్యానించారు.

కమీషన్ల కోసమే ‘రఫేల్‌’ ఆలస్యం..
తనపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ పార్టీ దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ నేతల ప్రసంగాలను పాకిస్తాన్‌లో ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్‌ ప్రతిస్పందన నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. మోదీపై వ్యతిరేకత వీళ్లను గుడ్డివాళ్లను చేసేసింది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేవారితో కాంగ్రెస్‌ జతకడుతోంది. 2008లో ఉగ్రవాది తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతల రక్తం మరగలేదు....’ అని మండిపడ్డారు. అనంతరం ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో మాట్లాడుతూ.. కమీషన్లపై కన్నేసిన కాంగ్రెస్‌ దేశభద్రతను పణంగా పెట్టి రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలును ఆలస్యం చేసిందని మోదీ ఆరోపించారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ ప్రసుత్తం కోర్టులో నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడన్నారు.

ఆరోగ్యానికి మంచిది కాదు..
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–ఆర్‌ఎల్డీ–బీఎస్పీలు మహాకల్తీ కూటమిగా తయారయ్యాయని విమర్శించారు. ‘ఈ మూడు పార్టీల పేర్లలోని తొలి అక్షరాన్ని తీసుకుంటే సరాబ్‌(షరాబ్‌–మద్యం)అని అర్థం వస్తుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ మహాకల్తీ కూటమి పాలనలో ఉగ్రవాదం దేశమంతటా విస్తరించింది. యూపీలో చేతులు కలిపిన ఎస్పీ–బీఎస్పీలు ‘ఒకరి తర్వాత మరొకరం యూపీని దోచేద్దాం’ అనే నినాదంతో వెళ్తున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించారు’ అని ప్రధాని తెలిపారు. బాలాకోట్‌ ఉగ్రస్థావరంపై దాడికి సంబంధించి సాక్ష్యాలు చూపాలన్న విపక్షాల విమర్శలపై స్పందిస్తూ..‘మనకు సాక్ష్యాలు కావాలా? లేక భారతమాత పుత్రుడు కావాలా? సాక్ష్యాలు చూపాలంటూ ఈ భారతమాత బిడ్డ(మోదీ)ను కొందరు సవాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

సరాబ్, షరాబ్‌కు తేడా తెలియదా?
తమను మద్యంతో పోల్చడంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ప్రధాని మోదీ విద్వేషపు మత్తులో మాట్లాడుతున్నారని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. ఆయనకు సరాబ్‌ (ఎండమావి), షరాబ్‌(మద్యం)కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను మద్యంతో పోల్చడం ద్వారా మోదీ పేదలను అవమానించారని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలనీ, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మోదీ తన స్థాయిని దిగజార్చుకున్నారని పేర్కొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top