ప్రఙ్ఞా సింగ్‌ క్షమాపణ చెప్పాల్సిందే: బీజేపీ నేత

Muslim BJP Leader Says Decided Not Campaign For Sadhvi Pragya Till She Apologise - Sakshi

భోపాల్‌ : ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకురాలు ఫాతిమా రసూల్‌ సిద్దిఖి డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పేదాకా ఆమెకు మద్దతుగా నిలిచేది లేదని, ప్రచారంలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. భోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌కు పోటీగా మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నిలబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రఙ్ఞా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డిసెంబర్‌ 6, 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసంలో మసీదును కూల్చిన బృందంలో తానూ ఉన్నానని, ఈ ఉద్యమంలో పాలుపుంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ విషయం గురించి సిద్దిఖి మాట్లాడుతూ.. ‘వాళ్లు(బీజేపీ) చాలా మంచివాళ్లు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పినందువల్లే బీజేపీలో చేరాను. ప్రఙ్ఞా కారణంగా ముస్లింలతో సత్సంబంధాలు కలిగి ఉన్న బీజేపీ నేతల ఇమేజ్‌ కూడా దెబ్బతిన్నది. ఆ విధంగా మాట్లాడి ముస్లింల మనోభావాలను కించపరిచారు. అందుకే ఆమె క్షమాపణ చెప్పేంత వరకు ప్రచారంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. అలోక్‌ సంజార్‌, సురేందర్‌ సింగ్‌, అలోక్‌ శర్మ, విశ్వాస్‌ సారంగ్‌ వంటి ఎంతో మంది మంచి నాయకులు ఉన్నప్పటికీ ఆమెకు టికెట్‌ ఇచ్చారు’ అని పేర్కొన్నారు.

కాగా ఫాతిమా సిద్ధిఖీ నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి రసూల్‌ అహ్మద్‌ కూతురైన ఫాతిమా 2018 నవంబరులో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భోపాల్‌ నార్త్‌ నుంచి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరిఫ్‌ అక్వీల్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక ఆరో దశ పోలింగ్‌లో భాగంగా మే12న భోపాల్‌లో పోలింగ్‌ జరగనుంది. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రికల ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయన్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top