
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తన స్నేహితుడు జగన్ హత్యాయత్నం నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్నారని, దేవుడు చాలా గొప్పవాడని ఆయన అన్నారు. జగన్‌ను ఆదివారం ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తన స్నేహితుడు జగన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించారని, అసలు ఓ వ్యక్తి విమానాశ్రయంలోకి అదీ వీఐపీ లాంజ్‌లోకి కత్తితో ఎలా వచ్చాడు? అని ఒవైసీ ప్రశ్నించారు. జగన్ గొంతుపైన పొడవటానికి నిందితుడు ప్రయత్నించాడని ఆయన అన్నారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు మరీ ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ ఉంటాయని, అయితే ఓ ముఖ్యమంత్రి అలా మాట్లాడ్డం ఎంత మాత్రం సరికాదని, కనీసం ఫోన్‌లో అయినా జగన్‌ను చంద్రబాబు పరామర్శించి ఉండాల్సిందని అభిప్రాయ పడ్డారు. ‘మనమంతా మనుషులం కనుక, సాటి మనిషిపై మానవత్వం ప్రదర్శించాల్సిన కనీస బాధ్యత ఉందని, అయితే చంద్రబాబు వంటి వ్యక్తి నుంచి ఇలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు.
మరింత జాగ్రత్తగా ఉండాలని జగన్‌కు చెప్పా...
జగన్‌ను ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పానని, భవిష్యత్తులో రాజకీయాల్లో ఆయన తిరుగులేని పాత్ర పోషిస్తారని ఒవైసీ అన్నారు. జగన్‌ను నిర్మూలించాలని చేసిన కుట్రపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గళమెత్తాలి. చంద్రబాబు ఆటలను (గేమ్ ప్లాన్‌ను) ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారని, తగిన సమయంలో సమాధానం చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని తేలిక చేసి మాట్లాడి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలిచారు? అని ఒవైసీ ప్రశ్నించారు.