
విజయ సాయి రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ వెనుక భారీ దోపిడీకి కుట్ర జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటనను ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్‌లో పాల్గొనకుండా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిషేదించారని పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే టెండర్‌కు అర్హులను చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ దోపిడీకి పథక రచన జరిగిందని ఆరోపించారు.
గతంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఈ టెండర్‌ను దక్కించుకోవడంతో కుంటి సాకులు చూపుతూ సీఎం చంద్రబాబు దానిని రద్దు చేశారన్నారు. తాజాగా జారీ చేసిన టెండర్‌లో అసలు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ పాల్గొనకుండా నిషేదించడం సరైన చర్యనేనా అని ప్రశ్నించారు. ప్రైవేట్ కంపెనీలైతే వారితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చని, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అయితే దోపిడీ సాధ్యకాదనే ఇలా చేశారని మండిపడ్డారు. ఇది కాదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.