
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలోనే సంక్షేమ పథకాల అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల మన్ననలను పొందుతున్నారని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీలో ప్రవేశపెట్టిన సచివాలయ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. తొలి ఏడాది పాలనలోనే సీఎం వైఎస్ జగన్ దేశంలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారని ప్రశంసించారు. ఇవన్నీ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బాబు కక్ష సాధింపు అని ఎలా అంటారని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారని నిలదీశారు. (అవినీతిపరుడిని అరెస్ట్ చేస్తే.. బీసీ కార్డా?)
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాల వల్లే ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా ఎందుకు బేటీ అయ్యారో చెప్పాలి. ప్రభుత్వంపై కుట్రలు పన్నే ప్రతిపక్ష నేతలతో జరిపిన మంత్రాంగమేంటో నిమ్మగడ్డ చెప్పాలి. తన తల్లిని కూడా కలవనీయటం లేదంటూ నిమ్మగడ్డ ప్రభుత్వంపై బురద జల్లాలని ఎలా చూస్తారు? ఆయన వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. అతడిని ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం తిరస్కరించిదంటే తాను చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం ఏంటి?" అని మంత్రి ప్రశ్నించారు. (నిమ్మగడ్డ నోరు ఎందుకు విప్పరు?)