అవినీతిపరుడిని అరెస్ట్‌ చేస్తే.. బీసీ కార్డా?

YSRCP Leaders Speaks About Atchannaidu ESI Medical Scam - Sakshi

రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేస్తే బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు అన్నారు. పైగా కుల రాజకీయాలు చేయటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రభుత్వం బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అవినీతి చేసిన అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధమని వారు చంద్రబాబును, టీడీపీ నేతలను ప్రశ్నించారు. పదిమంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్‌ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి పుట్టలు బయట పడుతున్నాయని అన్నారు. అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలు..అడ్డదారిలో ప్రయాణం చేసిన విధివిధానాలపై ఏసీబీ పలు కోణాల్లో అవినీతిపై దర్యాప్తు చేసిందని, ఆధారాలు లభించిన తర్వాతే అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేయటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంది 
టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే దానికి అచ్చెన్నాయుడు ఉదంతమే నిదర్శనం. త్వరలో టీడీపీ హయాంలో వివిధ శాఖల్లో అవినీతి చేసిన మంత్రులు కూడా బయటపడతారు. అవినీతి చేసినందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో పని చేసే కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదు. టెలీసర్వీస్, ఆర్‌íసీ, నాన్‌ ఆర్‌íసీ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. మందులు సరఫరా చేసిన  కంపెనీల బకాయిలున్నాయి. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగిందని తెలిసింది.
–  గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

ఆయన అక్రమాలు చేస్తే నేను రాజీనామా చేయాలా? 
అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడితే నన్ను రాజీనామా చేయమనటం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసులో కూడా దళితులపై దాడి అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు చేస్తే బీసీలపై దాడి అనడమేంటి? ఇలా కుల రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. రూ.లక్ష విలువ చేసే సోఫాని రూ.10 లక్షలకి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ఈఎస్‌ఐ స్కాంలో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులుంటాయి. – సుచరిత, హోంమంత్రి

కుంభకోణంలో కుల ప్రస్తావన ఎందుకు?   
టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రత్యేకించి అక్రమ మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తుంది.  ప్రభుత్వ సంపాదన ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్దహస్తులు ఇంకొకరు లేనేలేరు. ఈఎస్‌ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి బయటపడుతోంది. నువ్వు  రూ.పది తిను.. దాంట్లో నా వాట నాకివ్వు  అనే భాగస్వామ్య విధానం చంద్రబాబు జమానాలో నడిచింది. దానికి బీసీకార్డును వాడాల్సిన అవసరమేముంది.  – మోపిదేవి వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి

ఆయన అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డెక్కాలి? 
అచ్చెన్నాయుడు అవినీతికి బీసీలకు ఏం సంబంధం? అవినీతి చేసిన వారిని అరెస్ట్‌ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబే. బాబు పాలనలోని ప్రతి అవినీతిపైనా విచారణ జరిపిస్తాం. అచ్చెన్నాయుడు అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డు మీదకు రావాలి. గతంలో బీసీ ఎమ్మెల్యే అయిన నన్ను టార్గెట్‌ చేయలేదా? – అనిల్‌కుమార్‌యాదవ్, మంత్రి

సిగ్గు లేకుండా విమర్శలా?
ఆధారాలతో దొరికాడు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అయ్యారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబును, లోకేశ్‌ని లోపలేయించేవారు. త్వరలో చంద్రబాబు, లోకేశ్‌ అవినీతిపై సీబీఐ విచారణజరుగుతుంది. – ఆర్కే రోజా, నగరి ఎమ్మెల్యే

చట్టం తన పని తాను చేసుకుపోతుంది .. 
బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే, ఓర్వలేని ఓ ఆంబోతు, ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్‌ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మాగాంధీనా, లేక పూలేనా? ఈఎస్‌ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలి? స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములే. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర ఎంత అనేది ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది.  సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు ఓ అంబేడ్కర్, ఓ పూలేలా అవతరించారు.  – శంకరనారాయణ, రాష్ట్ర మంత్రి

చట్ట ప్రకారమే.. 
అచ్చెన్నాయుడు అరెస్ట్‌ చట్ట ప్రకారం జరిగింది. ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం, రూ.కోట్ల అవినీతిపై విజిలెన్స్‌ ఆధారాలు సేకరించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసింది. చట్టం ముందు అందరూ సమానులే. కులాలతో సంబంధం లేదు. – మహమ్మద్‌ ఇక్బాల్, ఎమ్మెల్సీ

ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు.. 
అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేస్తే బీసీలను అణగదొక్కుతున్నారనడం సిగ్గుచేటు. అయిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్ట్‌ చేసినప్పుడే జనం హర్షిస్తారు.
– బుర్రా మధుసూదన్‌ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే

కుంభకోణం సూత్రధారి అచ్చెం 
ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ప్రధాన సూత్రధారుడని ఏసీబీ విచారణలో తేలింది. పేదల వైద్యానికి చెందాల్సిన సొమ్మును తిన్న వ్యక్తిని వెనకేసుకొస్తున్న బాబు పచ్చి దుర్మార్గుడు.
–కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే

కులాన్ని ఆపాదించడం తగదు
ప్రతి దానికి చంద్రబాబు కులం రంగు పులమటం తగదు. చేసిన తప్పు నుంచి తప్పించుకొనేందుకు బీసీ ప్రస్తావన చంద్రబాబు తెస్తున్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారు. బీసీలకు చంద్రబాబు శనిలా దాపురించారు. – కె.పార్థసారథి, ఎమ్మెల్యే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top