ఆదుకోవడం చేతకాక కేంద్రంపై నిందలు

Mopidevi Venkataramana Fires On Chandrababu Naidu - Sakshi

వజ్రపుకొత్తూరు రూరల్‌ : శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాక కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలపై  ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. తుపాను బాధితులకు పూర్తిస్థాయిలో సాయం కూడా అందించలేని స్థితిలో చంద్రబాబు సర్కార్‌ ఉందన్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక, పల్లిసారథి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో వెంకటరమణ మాట్లాడుతూ కేవలం మూడు నియోజకవర్గాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లితే.. రాష్ట్రం మోత్తానికి నష్టం కలిగినట్లు తమ దగ్గర డబ్బుల్లేవని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దాతలు ముందుకు రావడం లేదని కుంటిసాకులు చెబుతూ చంద్రబాబు  తప్పించుకుంటున్నారని మండి పడ్డారు. తుపాను తీవ్ర నష్టం కలిగిస్తే బాధితులకు కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.

తుపాను ప్రభావిత గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజల అవసరాలు తీరుస్తున్నామని, విద్యుత్‌ పునఃరుద్ధరించామని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. పలాస మున్సిపాలిటీ పరిధి 3 వార్డు తాళబద్రలో ప్రజలు తమను పట్టించుకునే వారే కరువయ్యారని పాలకుల తీరు పట్ల నిరసనలు వ్యక్తం చేశారంటే చంద్రబాబు ఏ మేరకు పనులు చేస్తున్నారో అర్థమవుతోందని హేళన చేశారు. తుపాను సంభవించి 10 రోజులు గడుస్తున్నా ప్రజలు నేటికీ నానా ఇబ్బందులు పడుతున్నారని, అయితే ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడటం లేదని, 80 శాతం పనులు పూర్తి చేశామని ముఖ్యమంత్రి ప్రకటించడం బాధాకరమన్నారు. పచ్చని ఉద్దానం నేడు మోడు బారిందని.. దీనిని చూసేవారికి కన్నీళ్లు ఆగడం లేదన్నారు. చేసిన అప్పులు తీర్చలేక, బతుకు తెరువుకు మార్గం కనిపించక చినవంకలో సైని నారాయణ్మ తనువు చాలించిందని.. సర్కార్‌ సకాలంలో బాధితులను ఆదుకోకపోతే ఇలాంటి పరిమాణాలు మరన్ని తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం ఉదార సానుభూతితో ఆదుకోవాలని సూచించారు.   ప్రభుత్వ అసమర్ధతను బాధితులు విమర్శిస్తుంటే  వారిపై కేసులు పెట్టి ఆరెస్టులు చేయడం సరికాదని, ప్రజా ఉద్యమాల ముందు పాలకులు తలదించాలన్నారు. 
 
మృతుని కుటుంబానికి పరామర్శ 
తుపానుతో జీడితోట నాశనం కావడంతో మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్డడిన చినవంక గ్రామానికి చెందిన సైని నారాయణమ్మ కుటుంబ సభ్యులను మోపినేని వెంకటరమణ, పలాస నియోజకవర్గ వై?ఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ సీదిరి అప్పలరాజులు పరామర్శించి వారిని ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమోండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరి, బల్ల గిరిబాబు, మండల అధ్యక్షు డు పి.గురయ్యనాయుడు, పీఎసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, దువ్వాడ జయరాం చౌదరి, జుత్తు నీలకంఠం, సీదిరి త్రినా«థ్, మోహనరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వడిస హరిప్రసాద్, మామిడి నర్సింహులు, ధర్మారావు ఉన్నారు.

తుపానులో బాబు రాజకీయం
మందస : ప్రకృతి విపత్తులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, ఇది రాజకీయం చేసే సమయమేనా అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. మందస మండలంలోని నారాయణపురం, హరిపురం పంచాయతీల్లో ఆయన  పర్యటించారు.   తిత్లీ తుపానుకు ఈ ప్రాంతం అతలాకుతమైందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లిందని, పూడ్చలేని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకోవాల్సింది పోయి, బాధిత ప్రాంతాల్లో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ తుపానుతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ తరుణంలో ప్రజలను ఓదార్చాల్సిన ముఖ్య మంత్రి ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి వేధిం చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. బాధితులను కలిసి వెంకటరమణ, అప్పలరాజులు ఓదార్చారు. కొబ్బరి, జీడి, మామిడితో పాటు ఉద్దాన పంటలను పూర్తిగా నష్టపోయామని బాధితులు వారికి వివరించారు. నాయకులు జుత్తు నీలకంఠం, ఆనల వెం కటరమణ, భాస్కరరావు, మావుడెల్లి జనార్దన  పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top