తాగినంత మద్యం.. జేబునిండా డబ్బు

Money And Alcohol Disributing in Gadwal Jogulamba Municipal Elections - Sakshi

గద్వాల: మున్సిపల్‌ ఎన్నికల పుణ్యమా అని ఓటర్లకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తాగినంత మద్యం పోస్తూ.. ఆడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2 వేల ముట్టజెప్పుతూ.. వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వార్డుల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు, అభ్యర్థులు పడరాని పాట్లుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్ల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రాత్రికి రాత్రే వార్డుల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా రూ.వేలు ఇచ్చేస్తున్నారు.

డబ్బులు, మద్యంతోపాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్‌ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వారి అనుచరుల ద్వారా డబ్బులు సైతం ఇప్పటికే వార్డుల్లోని బలమైన ఓటర్లుకు, వివిధ సంఘాలకు అందజేశారు. మరి కొంత నగదు అభ్యర్థులకు ఇచ్చి రాత్రివేళల్లో పంచడానికి ప్రణాళిక రూపొందించారు. దాదాపు అన్ని వార్డుల్లో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లోని 77 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు, మద్యం, చీరలు పంచడానికి నిమగ్నమయ్యారు. ఇప్పటికే సగానికిపైగా వార్డుల్లో డబ్బులు పంపిణీ చేశారు. ‘మూడు నోట్లు.. ఆరు బాటిళ్లు’ అన్న చందంగా అభ్యర్థులు ఓటర్లను ఆకర్శిస్తున్నారు.

ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి..
ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కొక్క వార్డు నుంచి చోటామోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీ వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సప్లయ్‌ చేయాలి..’ అన్న మాటలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి. ఎప్పటికప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ గెలుపే లక్ష్యంగా తొక్కాల్సిన దొడ్డి దార్లన్నీ అభ్యర్థులు తొక్కేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top