బాబు నీకు చివరి ఎన్నికలు: మోహన్‌బాబు

Mohan Babu slams On Chandrababu Naidu - Sakshi

పుంగనూరు రోడ్‌షోలో మోహన్‌బాబు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి విజయం కోసం ప్రచారం

పుంగనూరు : చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని, అబద్ధాల చంద్రబాబును ఇంటికి సాగనంపాలని విద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత, సినీనటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఇందిరా సర్కిల్‌ నుంచి బస్టాండు, పోలీస్‌స్టేషన్‌ మీదుగా గోకుల్‌ సర్కిల్‌ వరకు రోడ్‌షో నిర్వహించారు. ‘చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా వాసిగా ఉండి, అపద్దాలు చెబుతాడు నమ్మకండి.. నేను అల్లా సాక్షిగా , సాయిబాబా సాక్షిగా అపద్దాలు చెప్పను నిజాలే చెబుతా‘ అంటూ మోమన్‌బాబు ప్రసంగాన్ని ప్రారంభించారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు, చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఆయనను ఈయన ఏం చేశారో తెలుసా అంటూ ప్రశ్నించడంతో సభలో రకరకాల సమాధానాలు ఇచ్చారు. మోహన్‌బాబు నవ్వుతూ నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబునాయుడుకు లక్షల కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అంతా అవినీతి సొమ్మేనని ఆయన తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై 32 కేసులు ఉన్నాయంటూ అబద్ధపు మాటలు చెప్పే చంద్రబాబునాయుడుపై 11 కేసులు ఉన్నాయన్న విషయం ఎవరికైనా తెలుసా ? అన్నారు.

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా యువనాయకుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్‌ను చేతబట్టుకుని ప్రజలకు చూపుతూ.. డైలా గులతో సభను విజయవంతం చేశారు. మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, విశ్వనాథ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

25 వేల ఓట్లు అదనంగా వేయాలి 
‘నా ప్రచారంతో వైఎస్సార్‌సీపీకి అదనంగా 25 వేల ఓట్లు ప్రజలు వేయాలి. ఇది నా విన్నపం’ అని మోహన్‌బాబు ప్రజలను కోరారు. ‘ 2.30 లక్షల ఓట్లలో 2 లక్షలు మీరు వైఎస్సార్‌సీపీకి వేసేలా నిర్ణయించుకున్నారు. మిగిలిన 30 వేలలో 25 వేల ఓట్లు నా తరఫున వేయండి , ఐదువేల ఓట్లు మాత్రం ఇతరులకు వేయండి’ అని మోహన్‌బాబు కోరగానే జనం కేరింతలతో చప్పట్లు కొట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top