టచ్‌లో 40 ఎమ్మెల్యేలు

Modi claims 40 TMC MLAs are in touch with BJP - Sakshi

లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక వీరంతా టీఎంసీని వీడతారు

బెంగాల్‌లో ప్రచారంలో మోదీ

శ్రీరామ్‌పూర్‌/కొదెర్మా: బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని మోదీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారన్నారు.బెంగాల్,జార్ఖండ్‌లో ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయొద్దు..
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునాదులు కదలిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధాని పీఠంపై మమత కన్నేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘దీదీ.. కేవలం కొన్ని సీట్లతో మీరు ఢిల్లీని చేరుకోలేరు. ఢిల్లీ చాలాదూరంలో ఉంది. ఢిల్లీ పీఠంపై మమత దృష్టి పెట్టారన్నది ఎంతమాత్రం నిజం కాదు. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో తన మేనల్లుడు అభిషేక్‌ను సుస్థిరం చేసేందుకు మమత ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మమతకు అర్థమైంది.

అందుకే ఆమె తరచూ సహనాన్ని కోల్పోతున్నారు’ అని మోదీ తెలిపారు. అభిషేక్‌ ప్రస్తుతం డైమండ్‌ హార్బర్‌ లోక్‌ సభ సీటు నుంచి పోటీచేస్తున్నారు. అలాగే బెంగాల్‌లో ఎన్నికల హింసపై మోదీ స్పందిస్తూ.. ‘మమతా దీదీ.. మీ గూండాలు ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటున్నారు. మీరు ఇప్పుడు కూర్చుంటున్న సీఎం కుర్చీని ప్రజాస్వామ్యమే ఇచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయవద్దు. ఎవరికి ఓటేయాలో బెంగాల్‌ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని స్పష్టం చేశారు.

బెంగాల్‌ ప్రజలు మోదీకి ఓటేయరనీ, అవసరమైతే రాళ్లు, మట్టితో చేసిన రసగుల్లాలు విసిరి పళ్లు విరగ్గొడతారని మమత  విమర్శలపై మోదీ స్పందించారు. ‘అది(మట్టి–రాళ్లు) నాకు ప్రసాదం లాంటివి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్, ఠాకూర్‌ వంటి మహనీయులు పుట్టిన పవిత్రమైన బెంగాల్‌ నేల నుంచి వచ్చిన రాళ్లు, మట్టిని వినమ్రంగా స్వీకరిస్తా. మమత చెప్పిన మట్టి రసగుల్లాల్లో రాళ్లను కూడా నేను స్వాగతిస్తున్నా. నాపైకి ఎన్ని రాళ్లున్న రసగుల్లాలు వస్తాయో, టీఎంసీ గూండాల చేతిలో బెంగాల్‌ ప్రజలకు అన్ని దెబ్బలు తప్పుతాయి’ అని అన్నారు.

కౌన్సిలర్‌ కూడా వెళ్లడు: టీఎంసీ
40 మంది తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న మోదీ వ్యాఖ్యలపై టీఎంసీ సీనియర్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ‘పదవీకాలం ముగిసిపోతున్న ప్రధాని బాబూ.. ఓ విషయం అర్థం చేసుకోండి. మీతో ఎవ్వరూ రావట్లేదు. ఎమ్మెల్యేలు తర్వాత సంగతి.. మా పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్‌ కూడా మీతో రాడు. మీ సమయం ముగిసిపోయింది. మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? లేక మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారా? ఈ విషయంలో మేం ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top