‘మంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు..’ | Sakshi
Sakshi News home page

‘మంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు..’

Published Thu, Nov 16 2017 9:27 PM

Mlas Criticize the TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాము ప్రతిపాదించిన అంశాలన్నింటిపై చర్చ జరిగేదాకా సభను నిర్వహించాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ లాబీలో గురువారం వారు మాట్లాడుతూ.. చర్చించడానికి 18 అంశాలను మొదట జరిగిన బీఏసీ సమావేశంలోనే ప్రతిపాదించామని భట్టి, రామ్మోహన్‌ రెడ్డిలు చెప్పారు.

ఇప్పటిదాకా 5 అంశాలపై మాత్రమే చర్చ..
ఇప్పటి వరకూ కేవలం ఐదు అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని, ఇంకా 13 అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. సభ ఎన్ని రోజులు జరుపుతారని కాంగ్రెస్‌ పార్టీని అడగలేదని, ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలన్నీ చర్చించాలని అడుగుతున్నామని భట్టి వెల్లడించారు. సభను ముగించాలని కాంగ్రెస్‌పార్టీ కోరిందని టీఆర్‌ఎస్‌ మంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేయాలని ఎప్పుడూ అనలేదని చెప్పారు.

సభ్యుల సంఖ్య ఎక్కువ, అధికారం ఉందనో..
సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందనో, అధికారం ఉందనో అసెంబ్లీ చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ తప్పించుకునే విధంగా వ్యవహరిస్తుందని భట్టి ఆరోపించారు. తాము ప్రతిపాదించిన అంశాలన్నీ చర్చకు రావాలని బీఏసీ సమావేశంలో కోరుతామని భట్టి వెల్లడించారు. సభను ముగించాలని కాంగ్రెస్‌ పార్టీ కోరినట్టుగా తప్పుడు ప్రచారం మంచిదికాదని, ఇంకా 13 అంశాలపై చర్చించేదాకా సభను నిర్వహించాలని రామ్మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

చర్చకు రావాల్సిన అంశాలు..
మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలు, శాంతిభద్రతలు, మహిళలపై వేధింపులు, నయీం కేసు, మియాపూర్‌ భూములుచ డ్రగ్స్‌, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, స్వయం సహాయక సంఘాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ, వైద్యం, జీఎస్టీ ప్రభావం, బీసీ సబ్‌ప్లాన్‌ వంటి అంశాలెన్నో చర్చకు రావాల్సి ఉందని వారు అన్నారు. వీటిపై చర్చించే వరకు సభను నిర్వహించాలని రామ్మోహన్‌ రెడ్డి కోరారు. బీఏసీ సమావేశం శుక్రవారం ఉంటుందని, అధికారకంగా చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. సభను 50 రోజులు నడుపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement