చింతమనేని వ్యాఖ్యలపై ఫైర్‌

MLA RK Roja Slams Chintamaneni Prabhakar - Sakshi

ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌

సీఎం అండతోనే రెచ్చిపోతున్నాడని ఆగ్రహం

జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మ దహనం

చిత్తూరు అర్బన్‌: దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. గతనెలలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో చింతమనేని మాట్లాడుతూ ‘‘పదవులు మాకు.. రాజకీయాలు మాకు. మీకెందుకురా.. ఈ కొట్లాటలు’’ అంటూ తీవ్రంగా దూషించడంపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జిల్లాలోని పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని, ఆయన్ను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

చింతమనేని అనుచిత వ్యాఖ్యలపై బంగారుపాళ్యంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బంగారుపాళ్యం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. చింతమనేనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలోనూ చింతమనేని అధికారులపై, ప్రజలపై దాడులకు పాల్పడ్డా తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబునాయుడు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. కాగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

విజయపురం మండలం పన్నూరు సబ్‌ స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా మాట్లాడుతూ ప్రభాకర్‌ అసెంబ్లీలోనే తమపై దౌర్జన్యం చేసినా దిక్కులేదన్నారు. అ టవీ శాఖ అధికారులను కొట్టినా, తహసీల్దార్‌ వనజాక్షిని ధూషించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఇప్పుడు దళితులపై అనుచితంగా మాట్లాడుతున్నా సీఎం మౌనం వ హించడం సిగ్గుచేటమన్నారు. రోజాతో పాటు యువజన విభాగ నాయకులు శ్యామ్‌లాల్, రైతు నాయకులు లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.

పలమనేరులో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పార్టీ సీనియర్‌ నేత సివి.కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న దెందలూరు ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవడానికి టీడీపీ ఎందుకు భయపడుతోందన్నారు. కులహంకారంతో దిగజారుడు వ్యా«ఖ్యలు చేస్తున్న ఇతనిపై స్పీకర్‌ కల్పించుకోవాలని, వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

తిరుపతి రూరల్‌ మండలం పేరూరు వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేçశవులు ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్‌ ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. పేరూరు కూడలిలో చింతమనేని చిత్రపటాన్ని దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షుడు గోపి, నాయకులు జయచంద్ర, వాసు తదితరులు పాల్గొన్నారు.

చింతమనేని వ్యాఖ్యలను నిరసిస్తూ బి.కొత్తకోటలో భారతీయ అంబేడ్కర్‌ సేవ (బాస్‌) కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. దళితులను కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బాస్‌ నాయకులు సచిన్, సింగన్న డిమాండ్‌ చేశారు.

పుంగనూరు అంబేడ్కర్‌ కూడలిలో చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
చింతమనేని దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రి మండలిలోని పలువురు నేతలు దళితులపై తీవ్ర పదజాలం వాడుతూ దూషణలకు దిగుతున్నారన్నారు. వీరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీ యూ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top