ఎన్టీఆర్, అనుష్క అంటే ఇష్టం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

MLA Redya Naik Family Exclusive Interview - Sakshi

‘సాక్షి పర్సనల్‌ టైమ్‌’లో మాజీ మంత్రి, డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌

మాజీ మంత్రి, డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌ ఉమ్మడి జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేనే కాదు.. మంత్రిగా కూడా పనిచేశారు ధరంసోత్‌ రెడ్యానాయక్‌. ప్రస్తుతం డోర్నకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎన్టీఆర్‌ నటించిన ప్రతీ సినిమా.. అదీ విడుదలైన రోజునే చూడడం అలవాటు.. అయితే, రాజకీయాల్లో వచ్చాక సినిమాలు చూసే తీరిక దొరకడం లేదు.. చివరగా బాహుబలి చూశారు.. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి గంటల తరబడి కబడ్డీ ఆడే ఆయన ఇప్పుడు ప్రో కబడ్డీ చూస్తూ ఆ సరదా తీర్చుకుంటున్నారు.. నాటు కోడి, చేపల కూర ఉంటే చాలు అన్నం కొంచెం ఎక్కువగానే తినే ఆయన ఇప్పుడు కొంచెం తగ్గించారు.. ఇలాంటి ఎన్నో విషయాలను రెడ్యానాయక్‌ ‘సాక్షి’ పర్సనల్‌ టైమ్‌లో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 

‘నాకు సీనియర్‌ ఎన్టీఆర్‌ నటన అంటే ఇష్టం. ఆయన సినిమా రిలీజ్‌ అయిన రోజే చూసేవాడిని. ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులవుతోంది.. చివరగా బాహుబలి సినిమా చూశా.. అందులో అనుష్క నటన నచ్చింది.. నాకు అన్నింటి కంటే కబడ్డీ ఇష్టమైన ఆట.. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని.. డోర్నకల్‌ నియోజకవర్గంలోని భూములకు రెండు పంటలకు నీరు అందించాక ఇక్కడి రైతుల ముఖంలో ఆనందాన్ని చూడడమే నా జీవితాశయం..’ 

 సాక్షి, మహబూబాబాద్‌: ఇంట్లో సందడే సందడి మాది పెద్ద కుటుంబం. మేము నలుగురం అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్లతో ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. నా చిన్నప్పుడు మా ఊరైన ఉగ్గంపల్లిలోనే 8వ తరగతి వరకు చదువుకున్నా. ఆ తరువాత 9, 10వ తరగతి హన్మకొండలో విద్యనభ్యసించా. అనంతరం ఇంటర్‌ మహబూబాబాద్‌లో చదివాను. వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజిలో డీగ్రీ బీఏ పూర్తి చేశాను. కాలేజీ రోజుల్లో సినిమాలు బాగా చూసేవాడిని. ఎన్టీఆర్‌ అంటే పిచ్చి. ఎన్టీఆర్‌ నటించిన ప్రతీ సినిమా.. అదీ విడుదలైన రోజు చూడాల్సిందే. చిరంజీవి సినిమాలంటే కూడా ఇష్టం. టీవీలో చిరంజీవి సినిమా వస్తే ఇప్పటికీ తప్పకుండా చూస్తా. ఇప్పుడు బాగా బిజీ కావటంతో పాటు చూడదగిన సినిమాలు రాకపోవడంతో బాగా తగ్గించా. చివరగా బాహుబలి సినిమాను భార్యాపిల్లలతో కలిసి చూశా ఆ సినిమాలో అనుష్క నటన నచ్చింది. చిన్నప్పుడు సెలువులు వచ్చాయంటే బావుల్లో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం కేటాయించటోడిని. కబడ్డీ ఆట అంటే ఇష్టం. స్కూళ్లో, కాలేజీలో మంచి ఆటగాడిగా గుర్తింపు వచ్చింది. టీవీలో ప్రో కబడ్డీ  మ్యాచ్‌లు వస్తే ఇష్టంగా చూస్తా.

చికెన్‌ వండేది..
గతంలో నాన్‌ వెజ్‌ బాగా తీసుకునేవాడిని. ఇప్పుడు కొం చెం తగ్గించాను. అప్పుడు ఇప్పుడైనా నాటు కోడి కూర, చేపల కూర అంటే మహా ఇష్టం. అన్నంలో ఇవి ఉంటే ఒక ముద్ద ఎక్కువే తింటా. హాస్టల్‌లో పుడ్‌ లీడర్‌గా ఎ న్నికై, అక్కడి విద్యార్ధులకు మంచి అన్నం పెట్టించేవాడి ని. కాలేజీ రోజుల్లో చికెన్‌ వంట చేసేవాడిని. కురవి వీరభద్ర స్వామి భక్తుడిని. మా ఇంట్లో ఏ శుభ కార్యం మొదలు పెట్టినా కురవి వీరన్నను దర్శించుకోవాల్సిందే.

రాజకీయ ప్రస్థానం
మా తాత అప్పట్లో 20 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేసిండు. దీంతో మండల సమితిలకు నన్ను వెంట బెట్టుకుని తీసుకుని పోయేవాడు. తద్వారా నాకు తెలియకుండానే రాజకీయాలంటే ఇష్టం ఏర్పడింది. మొదటగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు డైరెక్టర్‌గా పనిచేయటంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉగ్గంపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక సమితి ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసినా. అనంతరం ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాను. నిజాయితీగా బతకాలని... బకరి రుణం ఉంచుకోరాదని.. ఇతరులకు మేలు చేయకపోయినా చెడు చేయొద్దని మా తాత చెప్పేవారు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన దాన్ని మరవలేదు. అందుకే కావొచ్చు ఈ నియోజకవర్గ ప్రజలు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆరు సార్లు గెలిపించారు.

అమ్మ ఆశీర్వాదమే బలం
మేం నలుగురు అన్నదమ్ములం. ఇద్దరు చెల్లెళ్లు. నన్ను అమ్మ ఎక్కువగా ప్రేమతో చూసేది. నా ఎదుగుదల వెనుక అమ్మ శ్రమ ఎంతో ఉంది. ఆమె భౌతికంగా లేకున్నా ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయి. నేను ఈ వయస్సులోనూ ఆరోగ్యంగా, బలంగా ఉన్నానంటే ఆ రోజుల్లో అమ్మ చేసిన రొట్టెల బలమే. ఆ రోజుల్లో బియ్యం బువ్వ ఎక్కడిది? పిండి దంచి రొట్టెలు చేసి పెడితే అవి పట్టుకుని కాలేజీకి పోయి చదువుకున్నాం. చదువుకునే రోజుల్లో ఎంతో ఇబ్బందులు పడ్డాం. కానీ అవే నాకు ఈరోజు పాఠాలుగా, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే శక్తిని ఇచ్చాయి. కష్టాలు వస్తే భయపడవద్దు... వాటిని ధైర్యంగా ఎదుర్కొన్ని నిలబడాలి.

వ్యవసాయంపై మక్కువ
నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే మక్కువ. రాజకీయాల్లో బిజీ కావడంతో వ్యవసాయం స్వతహాగా చేయలేకపోతున్నా.. కానీ సమయం దొరికితే కూలీలతో పనులు చేయిస్తా. నా భార్య మంగమ్మ వ్యవసాయ పనులు దగ్గరుండి చూసుకుంటుంది. తను ఇప్పటికి కూడా వ్యవసాయ పనులు చేస్తుంది.

భార్య సహకారం మరవలేనిది
నా భార్య మంగమ్మ సహకారంతోనే నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నా. రాజకీయాల్లో బిజీ కావటంతో పిల్లల చదువులు, వారి బాగోగులు, ఇంటిపనులు, వ్యవసాయ పనులు, ఇంటికి వచ్చిన కార్యకర్తల మంచీ, చెడు అన్నీ ఆమె చూసుకుంటోంది. దీంతో నా పని తేలికైంది.

బిడ్డలకు అదే చెబుతా..
ప్రజలకు సేవ చేయాలన్నది నా ఫిలాసఫీ. మొదటి నుం చి నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నా. నా పిల్లలకైనా, కార్యకర్తలకైనా ఇదే చెబుతాను. మనల్ని నమ్మిన వారి కోసం పనిచేయటంలో ఉన్న సంతృప్తి మరేదాని లోనూ ఉండదని నేను నమ్ముతా.. ఆచరిస్తా.

వైఎస్సార్‌ మృతితో మా కుటుంబ సభ్యుడిని కోల్పోయా
నేను జనరల్‌ సీటులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపొందా. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అండతో మంత్రిన య్యా, ఇక నా కూతురు ఎమ్మెల్యేగా గెలుపొందింది. వైఎస్సార్‌ అకాల మరణం అప్పట్లో నన్ను చాలా బాధించింది. మా ఇంట్లో కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు అనిపించింది. సార్‌ నన్ను తన ఇంటిలో కుటుంబసభ్యుడిలాగా చూసేవారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన రోజు నేను చాలా బాధపడ్డా. ఆ రోజే నా జీవితంలో చీకటి రోజుగా భావిస్తా. కానీ ప్రజలు నా సేవలను గుర్తించి తిరిగి మళ్లీ 2014లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.

కేసీఆర్‌ తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేయటంతో పాటు, సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో విజన్‌ ఉన్న నాయకుడు. డోర్నకల్‌ నియోజకవర్గమే కాదు.. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలిసిన నాయకుడు. అందుకే నేను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాను. కేసీఆర్‌ మా బిడ్డ కవితను తన బిడ్డగా భావించి ఎంపీగా అవకాశం కల్పించారు. ఈ టర్మ్‌తో నాకు 70 ఏళ్లు నిండనున్నాయి. కేసీఆర్‌ ఆశీస్సులతో నా కొడుకు రవిచంద్రను ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది. డోర్నకల్‌ నియోజకవర్గ రైతాంగానికి రెండు పంటల సాగు నీరు అందించి వారి ముఖంలో ఆనందం చూడటమే నా జీవితాశయం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top