ఇళ్ల నిర్మాణంపై వినూత్న ఆందోళన

mla Rachamallu Siva Prasad Reddy anxiety with demo house - Sakshi

ప్రొద్దుటూరు టౌన్‌ : ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ఏ విధంగా మోసం చేస్తోందో ప్రజలకు తెలియజేసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వినూత్న రీతిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో తొగటవీరక్షత్రీయ కల్యాణ మండపం పక్కన డెమో ఇల్లు ఏర్పాటు చేశారు. అందులో బుధవారం నుంచి ఎమ్మెల్యేతోపాటు కుటుంబ సభ్యులు నివాసం ఉండనున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ స్కీం పేరుతో జీ ప్లస్‌ త్రీ ఇంటి నిర్మాణాన్ని చేపడుతోంది. మొదటి రకం ఇంటిని 300 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షల సబ్సిడీ, మరో రూ.3.40 లక్షలను బ్యాంకు ద్వారా రుణం ఇప్పించనున్నారు.

ముక్కాలు సెంటు లోపు నిర్మించే ఇంటిలో వంట గది, బెడ్‌రూం, బాత్రూం, స్టోర్‌ రూంతోపాటు హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఏ కొలతలతో వీటిని నిర్మిస్తోందో.. అదే విధంగా ఎమ్మెల్యే డెమో ఇంటిని ఏర్పాటు చేశారు. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.. ఆ ఇంటిలో ఏ విధంగా ఉండేందుకు సౌకర్యాలు ఉన్నాయో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించనున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఇల్లు నిర్మించి.. 30 ఏళ్ల పాటు బ్యాంకుకు తనఖా పెట్టి ప్రతి నెలా రుణానికి అసలు, వడ్డీతో కలిపి 30 ఏళ్లకు రూ.18 లక్షలు ఎలా వసూలు చేస్తుందో.. ప్రజలకు వివరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

డెమో ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే రాచమల్లు మంగళవారం రాత్రి డెమో ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణం పేరుతో పేదలను ఏ విధంగా మోసం చేస్తోంది, ప్రజలు ఆ ఇంటిలో నివాసం ఉండేందుకు ఏ మేరకు అనుకూలమనే విషయాన్ని అక్కడికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులకు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రశ్నించే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నాయకులు పోసా భాస్కర్, వరికూటి ఓబుళరెడ్డి, చిన్నరాజా తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top