టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నా..

MLA Mani Gandhi opens up on Joining tdp  - Sakshi

టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నా- కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ

కోడుమూరు: ‘‘ ఆత్మ సాక్షిగా చెబుతున్న నేను తెలుగుదేశం పార్టీకి అమ్ముడుబోయిన ఎమ్మెల్యే. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ అంటూ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలియజేశారు.

తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వాల కోసం రూ.13.50లక్షలు చెల్లిస్తే.. ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు. సభ్యత్వ కార్డులను.. కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు దొంగలించారని ఆరోపించారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని, ఆరు నెలలు ఓపిక పడితే.. రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు. ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరికి అర్థంగాని పరిస్థితు లేర్పడతాయన్నారు. ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ కావాలని వర్ల రామయ్య, ఇన్‌చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనను బతిమిలాడినా లెక్క చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలైన మానుకొంటాను కాని, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి పనిచేసే సమస్యే లేదని..పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top