నా భర్త సహకారంతో ముందుకెళ్తుంటా..

MLA Gongidi Sunitha Mahender Reddy Life Story - Sakshi

2013 జనవరిలో దీక్షా దివస్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాలి. పిల్లల్ని పాఠశాలకు పంపించిన అనంతరం ఇద్దరం కలిసి వెళ్దామనుకున్నాం. కొంచెం అలసటగా ఉంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటానని నా భర్త మహేందర్‌రెడ్డికి  చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లి కింద పడ్డాను. తర్వాత చూస్తే  హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో ఉన్నా.   బ్రెయిన్‌ ట్యూమర్‌గా తేల్చారు.  మూడు రోజులకు తలకు శస్త్ర చికిత్స చేశారు.  కుటుంబ సభ్యుల సహకారం, నా విల్‌పవర్‌ నన్ను తిరిగి ఆరోగ్యవంతురాలిగా చేసింది.  ఇద్దరం ప్రజా జీవితంలో ఉన్నాం.. నేను ఒక మండలానికి వెళ్తే.. నా భర్త మరో మండలం చూసుకుంటారు.. ప్రతి విషయంలో ఆయన నాకు దిక్సూచిలా ఉంటారు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా.. కూర్చొని చర్చించుకుంటాం.. ఇద్దరం ఒకేమాట అనుకుంటాం.. దీంతో ఆ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది.. ఇక.. నేను ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.. అది నా భర్త సహకారం వల్లే. మాకు ఇద్దరు ఆడపిల్లలు. వారి చిన్న వయస్సులో వారితో ఎక్కువ గడపలేకపోయామన్న బాధ ఇప్పటికీ ఉంది. మళ్లీ ఆ జీవితం రాదు. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు.  ఆడపిల్లంటే ఇంటి మహాలక్ష్మి అంటారు. వారు మా ఇంటి మహాలక్ష్మీలే’. అని అంటున్నారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి. ప్రజా జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబ వ్యవహారాల్లో తన భర్త సహకారం, కుటుంబ విషయాలను ‘సాక్షి పర్సనల్‌టైమ్‌’తో పంచుకున్నారు. 

సాక్షి, యాదాద్రి : ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న సమయంలో నాకు ఊహించని విధంగా ప్రజాసేవ చేసే అవకాశం లభించింది. మా వారు క్రియాశీలక రాజకీయాల్లో ఉండే వారు. నేను ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో ప్రత్యేక పరిస్థితిలో ఉద్యోగాన్ని వీడి ప్రజా జీవితంలోకి వచ్చాను. భర్త మహేందర్‌రెడ్డి ప్రోత్సాహం, ఆయన నింపిన స్ఫూర్తి వెన్ను దన్నుగా నిలుస్తోంది. బీజీ పనుల్లో అయినా కుటుంబ పరంగా చాలా జీవితాన్ని కోల్పోతున్నాం. పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాం. ఆ జీవితం మళ్లీ రాదు. అయినా వారిని ప్రయోజకులను చేయాలన్నదే మా అభిమతం. అయితే కుటుంబ సభ్యుల వంటి ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సాక్షిపర్సనల్‌ టైమ్‌లో పలు విషయాలు వెల్లడించారు. 

మాకు ఇద్దరు ఆడిపిల్లలు. వారు చిన్నతనంలో పాఠశాలకు వెళ్లగానే మేమిద్దరం నియోజకవర్గానికి వచ్చే వాళ్లం. నేను రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా చిన్న కూతురు వయసు 8 నెలలు. పాపను మా అమ్మకు అప్పగిస్తే ఆమె ఆలనాపాలనా చూసింది. పిల్లలు పెద్దవుతుంటే వారితో కొద్దిసేపు గడపడానికి సమయం చిక్కేది కాదు. కేసీఆర్‌ ఉద్యమ సమయంలో రోజూ కార్యక్రమాలు ఉండేవి. దీంతో నియోజకవర్గంలో తిరగడానికి ఎక్కువ సమయం ఇచ్చేవాళ్లం. పిల్లలతో గడపలేకపోయిన జీవితం మళ్లీ రాదు. పిల్లల చదువు కోసం 2006నుంచి 2013 వరకు ఉప్పల్‌లో ఓ అద్దె ఇంట్లో ఉన్నాం. వాళ్లు పాఠశాలకు వెళ్లగానే ఆర్టీసీ బస్‌లో ఆలేరు నియోజకవర్గానికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నాం. పెద్దకూతురు అంజనీ యూఎస్‌లో ఎంఎస్‌ పూర్తి చేసింది. వివాహం చేశాం. రెండో కూతురు హర్షిత ప్రస్తుతం యూఎస్‌లో డిగ్రీ చదువుతోంది. 

వ్యక్తిగత జీవితం.. 

మా తల్లిదండ్రులు సరళ నర్సింహారెడ్డి, తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలో ఉండేవాళ్లం. ప్రా«థమిక విద్య వెస్లీ బాలికల పాఠశాలలో కొనసాగింది. 10వ తరగతి తర్వాత వరంగల్‌లో పాలిటెక్నిక్‌ చేశా. అనంతరం బీడీఎల్‌ అప్రెంటీస్‌ చేసి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. నా మొదటి జీతం రూ. 1800. ఉద్యోగం చేస్తూనే బీకాం ఉస్మానియాలో పూర్తి చేశా. 1990లో యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డితో వివాహం జరిగింది. 1991 వరకు ప్రైవేట్‌ ఉద్యోగం చేశా. ప్రైవేట్‌ ఉద్యోగం వదిలిపెట్టేనాటికి నా జీతం రూ.7.500. ప్రత్యేక పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చా. 

పేదలకు సేవ చేయడంలోనే ఆనందం
పేదలకు సేవ చేయడంలోనే ఆనందం చూసుకుంటున్నాం. ప్రధానంగా నియోజకవర్గంలోని పేదల వైద్యం కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం అర్థించి రావడం, వారికి సహాయం చేయడం జరుగుతోంది. తాము చేసిన సహాయం వల్ల బతికాం అంటూవచ్చి చెప్పినప్పుడు ఎంతో సంతృప్తి కరంగా ఉంటుంది. కొన్ని సార్లు ప్రభుత్వ సహాయం పొందినప్పటికీ ప్రాణాలు దక్కని వారు గుర్తువచ్చినప్పుడు బాధగా ఉంటుంది. 

నా భార్య బాధ్యతలను పంచుకుంటున్నా.. 
నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మర్రిచెన్నారెడ్డితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఆయన వ్యక్తిగత సహాయకులలో ఒకరిగా పనిచేశా. ఆయన వల్లే ప్రజాజీవితం అంటే నాకు అలవాటు అయింది. ప్రస్తుతం నా భార్య సునీత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. నియోజకవర్గం చాలా పెద్దది కాబట్టి ఆమె బాధ్యతలను నేనూ పంచుకుంటున్నా. ఒక్కోసారి ఇద్దరం రెండు మూడు రోజులు ఎదురుపడనంత బిజీగా ఉంటాం.  ఒకే రోజు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఉన్నప్పుడు చేరో వైపు వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకుంటాం. అలా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తాం. – గొంగిడి మహేందర్‌రెడ్డి

జీవితంలో ఈ ఘటన నాకే ఎదురవుతుందని ఊహించుకోలేదు. తీవ్రంగా అలసిపోయి రెస్ట్‌ తీసుకోవడానికి బెడ్‌పై పడుకున్న నేను కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు. ఒళ్లంతా నీరసంగా ఉంది. డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. మూడు రోజుల తర్వాత ఆపరేషన్‌ చేశారు. మూడు నెలల తర్వాత కోలుకున్న నేను మళ్లీ ప్రజల్లోకి రావడం అంటే ఆ లక్ష్మీనర్సింహస్వామి దయగానే భావిస్తా. 2013 జనవరిలో కేసీఆర్‌ చేపట్టిన పల్లెబాట కార్యక్రమాన్ని ముగించుకుని దీక్షా దివస్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి నాభర్త మహేందర్‌రెడ్డితో కలిసి సిద్ధం అయ్యా. పిల్లల్ని పాఠశాలకు పంపించిన అనంతరం బయటకు వెళ్దామనుకున్నాం. కాని కొంచెం అలసటగా ఉంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటానని నాభర్తకు  చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లా. అరగంట తర్వాత మావారు వచ్చి చూస్తే నేను బెడ్‌మీద కన్పించలేదు. కింద పడి కోమాలోకి వెళ్లిన నన్ను హుటాహుటిన హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్‌ ట్యూమర్‌గా తేల్చారు. 40 రోజుల పాటు విశ్రాంతి, సరైన తిండి లేకుండా తిరగడంతో ఒత్తిడి వల్ల మెదడుపై ప్రభావం పడిందని డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రిలో చేర్పించిన మూడు రోజులకు తలకు శస్త్రచికిత్స చేశారు. భగవంతుని దయతోనే నాకు పునర్జన్మ కలిగింది. కుటుంబ సభ్యుల సహకారం, నావిల్‌ పవర్‌ నన్ను తిరిగి ఆరోగ్యవంతురాలిగా చేసింది.    

మా ఆయన మహేందర్‌రెడ్డి నాకు దిక్సూచి. ప్రతికూలతలను అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నది నాకు వివరిస్తుంటారు. నేను ప్రజాజీవితంలో ఎలా ముందుకు సాగాలి, ప్రజలతో ఎలా మెలగాలి, వారి సమస్యల పట్ల ఎలా స్పందించాలి. విమర్శలు ఎలా ఎదుర్కోవాలి వంటి పలు అంశాలపై నాకు ఇంట్లో గైడ్‌ చేస్తారు. మాకు ఇంట్లో ఉన్నంత సేపు పలు అంశాలమీదనే వాదోపవాదాలు, చర్చలు. చివరగా పరిష్కారం కనుక్కుంటాం. ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు వాటిని పరిష్కరించడం కోసం ఏమి చేయాలి. ఇంకా ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారు వంటి అంశాలపై మా చర్చలు ఉంటాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top