శ్రీదేవి అంటే ఇష్టం: భూపాల్‌రెడ్డి

MLA  Bhupal Reddy Exclusive Interview - Sakshi

‘రాజకీయాల్లో ఉన్నాక.. ప్రజలే కుటుంబంగా భావించాలి. మాది రాజకీయ కుటుంబం. కాబట్టి మొదటి నుంచీ ప్రజలతో మమేకం కావడం ఎక్కువే. అందుకే ప్రజలే నా కుటుంబంగా జీవితాన్ని సాగిస్తున్నాను’ అంటున్నారు నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా.. ప్రజలతో గడిపిన ప్రతి క్షణం ఆ లోటును భర్తీ చేస్తుందని అంటున్న ఆయన.. తనకు నటి శ్రీదేవి అంటే మహా ఇష్టమని చెప్పారు. ఇంకా తన వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాయిష్టాలపై ‘సాక్షి పర్సనల్‌ టైమ్‌’తో తన సతీమణి జయశ్రీ రెడ్డితో కలిసి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..

నారాయణఖేడ్‌: నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాను. ఈ విజయాన్ని కట్టబెట్టిన నారాయణఖేడ్‌ నియోజకవర్గ ప్రజల రుణం ఏం చేసినా తీర్చుకునేది కాదు. అందుకే వారి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఈ క్రమంలో కుటుంబంతో గడిపే క్షణాలు తగ్గిపోతున్నా.. ప్రజల కోసం తప్పదు కదా!. మొన్ననే నా కుమారుడి వివాహమైంది. రెండు రోజులు మాత్రమే పెళ్లి పనులు చూసుకున్నా. మిగతా సమయమంతా ప్రజలతోనే ఉన్నాను. నా పరిస్థితిని కుటుంబసభ్యులూ అర్థం చేసుకుంటున్నారు (మధ్యలో భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీరెడ్డి కల్పించుకుని.. ‘అవును. ఆయన ప్రజల మధ్యే ఉంటే నేనే పెళ్లి బాధ్యతలన్నీ భుజాన వేసుకున్నా’ అని చెప్పారు).

వ్యక్తిగతమంటూ ఏదీ లేదు..
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నాకు వ్యక్తిగత జీవితమంటూ  ఏమీ లేదు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి బాగోగులు తెలుసుకోవడమే నా విధి. సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. నిత్యం నన్ను కలిసేందుకు వచ్చే ప్రజ లే నా కుటుంబసభ్యులు. కాబట్టి నేను వారినే ఓన్‌ చేసుకుంటున్నాను. ప్రజలు కూడా కుటుంబానికి సమయం త్యాగం చేసి మా కోసం పాటుపడుతున్నానని అంటున్నారు. ఆ తృప్తి చాలు.

కమల్, శ్రీదేవి అంటే ఇష్టం..
సినిమాలు చూడడం తక్కువ. సినిమా చూసి చాలా కాలం అవుతోంది. హీరో కమల్‌హాసన్, హీరోయిన్‌ శ్రీదేవి అంటే ఒకప్పుడు బాగా ఇష్టపడే వాడిని. ఇప్పుడసలు సినిమాలకు చోటేలేదు.

పేదల పెళ్లిళ్లకు తప్పక వెళ్తా..
ఒక శాసనసభ్యునిగా నాకు సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లల వివాహాలు, శుభకార్యాలకు రావాలని ఆహ్వానాలు వస్తుంటాయి. అదే సమయంలో ని యోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజల కుటుంబా ల్లో వివాహాలు, శుభకార్యాలు ఉంటాయి. నేను నా నియోజకవర్గ ప్రజల శుభకార్యాలకే ప్రాధాన్యం ఇస్తా. ఒక్కోరోజు 30, 40 వివాహాలు, శుభకార్యాలకు హాజరైన సందర్భాలున్నాయి. వారితో కలిసి భోజనం చేస్తే లభించే తృప్తి ఎనలేనిది. ఏ కార్యక్రమాలూ లేని రోజున మాత్రమే ప్రముఖుల శుభకార్యాలకు వెళ్తుంటాను.

భార్య, కుమారుడు, కుమార్తె..
నా సతీమణి జయశ్రీరెడ్డి. ఇంటర్‌ వరకు చదివారు. గృహిణి. కుమారుడు రోషన్‌ రెడ్డి. యూఎస్‌లో ఇంజనీరింగ్‌ తర్వాత ఎమ్మెస్సీ చదివాడు. కుమార్తె శ్రేయారెడ్డి. యూఎస్‌లో ఇంజనీరింగ్‌ చదివి ఐటీ ఉద్యోగం చేస్తోంది.

ఫ్యామిలీ పాలిటిక్స్‌కు ‘నో’
కుటుంబసభ్యులను రాజకీయాల్లో తీసుకొచ్చే ఆలోచన లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కదా.. కుటుంబసభ్యులందరూ ఆ హోదాలో ఉన్నట్టే. మళ్లీ కొత్తగా వారికి పదువులు ఎందుకు. జెడ్పీటీసీగా జయశ్రీరెడ్డిని పోటీకి నిలపాలని కల్హేర్‌ మండల నాయకులు, కార్యకర్తలు కోరారు. కానీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకే పదవి ఇవ్వాలని వారి అభిప్రాయాన్ని తిరస్కరించాను. రోషన్‌రెడ్డి తనకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించేందుకు స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నాను. పిల్లలు కూడా అదే ఇష్టపడుతుంటారు.

పాంచ్‌ కర్రీ భలే టేస్టీ..
గతంలో విహారయాత్రలకు వెళ్తుండే వాళ్లం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక రెండు మూడేళ్లకు ఓసారి వెళ్తున్నాం. సమయం చిక్కడం లేదు. అదీ రెండు మూడు రోజులు మాత్రమే. భోజనం లో పాంచ్‌ కర్రీ అంటే బాగా ఇష్టం. వెజిటేరియన్‌ వంటకాలను బాగా ఇష్టపడతాను. బేండి, క్యాప్సికం ఇష్టంగా తింటాను. కుటుంబంతో సమయం చిక్కినప్పుడు ఇంట్లోనే నాకు ఇష్టమైన ఆహారం వండిపెడతారు. ఇక కార్యకర్తలతో కలిసి ఉన్నప్పుడు భోజనానికి అందుబాటులో ఉన్న చిన్న హోట ల్‌కే వెళ్తాను. పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లాలనే ఆసక్తి లేదు. వారితో కలిసి సాధారణ భోజనమే చేసేందుకే ఇష్టపడతాను. కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేసిన సందర్భంలో వారిని ఆకలితో ఉంచకూడదనే భావనతో వారితో కలిసి భోజనం చేస్తాను. ఎక్కువగా ఇంట్లో సాధారణ భోజనమే చేస్తాను. 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు

కుటుంబానికి సమయం ఇవ్వడం లేదనే బాధ ఉన్నా.. ప్రజల కోసం ఆయన పాటుపడుతున్నారనే తృప్తి ఉంది. రాజకీయాల కారణంగా ఆయన పిల్లలతో గడిపిన సమయం చాలా తక్కువ. పిల్లల బాల్యంతో ఆయన ఎంజాయ్‌ చేయలేకపోయారు. అయినా నేను పిల్లలకు ఏదీ తక్కువ చేయలేదు. వెంకటేశ్వర, సరస్వతీ శ్లోకాలు నేర్పాను. యోగా, గేమ్స్, స్విమ్మింగ్, ఆర్ట్‌ ఇలా అన్ని రంగాల్లో వారికి ప్రావీణ్యం ఉండేలా చూశాను. అమ్మ ఏమీ చేయలేదనే భావన లేకుండా చూశాను. నేను మందిరాలకు ఎక్కువ వెళ్తుంటాను. దైవభక్తి ఎక్కువ. ఆయనకు రాజకీయాలు ఎంతిష్టమో వ్యవసాయమూ అంతే ఇష్టం. వ్యవసాయంపై ఇప్పటికీ మక్కువ చూపుతారు. ఆయనతో కలిసి సినిమా చూసి మూడేళ్లయింది. బాహుబలి–1 మాత్రమే చూశాం. (‘మరి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోలేదా మేడం?’ అని ‘సాక్షి’ అడగగా, ‘బాహుబలి–2 చూడలేదు కదా! తెలియదు’ అని జయశ్రీరెడ్డి, భూపాల్‌రెడ్డి దంపతులు నవ్వుతూ బదులిచ్చారు). – జయశ్రీరెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సతీమణి

నాన్నను అర్థం చేసుకున్నా..
నాన్న ప్రజల కోసం పని చేస్తున్నారు. ప్రజలనే ఆయన కుటుంబ సభ్యులుగా భావించి గడుపుతారు. వారి కోసమే ఎప్పుడూ పరితపిస్తుంటారు. మేమందరం నాన్న పరిస్థితిని అర్థం చేసుకుంటాం. నాన్న మా కంటే ప్రజల కోసం సమయం ఇవ్వడం అవసరం. ఆయన ప్రజల మనిషి. నియోజకవర్గ ప్రజలల్లో మేమూ ఒక్కటి అనే భావిస్తూ నాన్న అభిప్రాయాలకే విలువ ఇస్తా. – రోషన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కుమారుడు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top