
ఆత్మకూరు (మంగళగిరి): ఇచ్చిన మాట మీద నిలబడినందుకే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు పన్ని చంద్రబాబు, సోనియా గాంధీ జైలు పాలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది గుండెలు ఆగాయని, వారి కుటుంబాలను పరామర్శించి ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని వైఎస్ జగన్ పావురాలగుట్టలో మాట ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ తొమ్మిదేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు, సోనియా గాంధీ కుట్రలో భాగంగానే తాము జగన్‌పై కేసులు వేశామని శంకర్‌రావు, ఎర్రన్నాయుడు చెప్పిన విషయం ప్రజలందరికీ తెలుసని ఆర్కే అన్నారు. అయినా కేసులను లెక్క చేయకుండా వైఎస్ జగన్ ప్రజలతో గడుపుతున్నారని కొనియాడారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆరోపించారు. అలాంటి చంద్రబాబుకు, టీడీపీకి రానున్న ఎన్నికల్లో శ్వాశ్వత సమాధి తప్పదని హెచ్చరించారు. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎందాకైనా వెళ్లే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నవ వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో రెండు నెలల్లో అధికారంలోకి రావడం తధ్యమన్నారు.