ప్రభుత్వ ఘనత దేశమంతా తెలియాలి

Minister KTR Speaks About Telangana Development In Assembly Meeting - Sakshi

 రాష్ట్ర పథకాలపై మంత్రి కేటీఆర్‌

అందుకే అన్ని రాష్ట్రాల్లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నాం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలిసేందుకే పొరుగు రాష్ట్రాల్లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేవనెత్తిన అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఐదు సంవత్సరాల్లోనే అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు, రైతు బీమా పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలేగాక, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందన్నారు.

దేశవ్యాప్తంగా ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించినందుకే పలు రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోందని, దేశంలోని వివిధ రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తారని, ప్రగతిని అంచనా వేస్తారన్నారు. ప్రభుత్వమిచ్చే పత్రికా ప్రకటనలు కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయన్నారు. శాసనసభ్యులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. అది పరిష్కారమైతే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు.

కానీ స్థానిక నాయకత్వం చొరవ తీసుకుంటే ఇబ్బంది లేదని, ఇప్పటికే పది జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు స్థల కేటాయింపు అధికారాలను పరిశీలిస్తామని చెప్పారు. దేశంలో ఏరాష్ట్రం కూడా జర్నలిస్టులకు అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనక్కు తగ్గదన్నారు. అదేవిధంగా అడ్వర్టైజ్‌మెంట్‌లలో కూడా ఏమాత్రం తగ్గమని స్పష్టం చేశారు.

ఐదేళ్లలో యాభై ఏళ్ల ప్రగతి 
ఐటీ రంగంలో యాభై ఏళ్లలో సాధిం చిన ప్రగతిని కేవలం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదేళ్లలోనే సాధించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు 1.90లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఐటీలో హైదరాబాద్‌ త్వరలోనే బెంగళూరును దాటిపోతుందని అన్నారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చా రు. ఫేస్‌బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్‌ వంటి కంపెనీలు బెంగళూరును కాదని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సమర్థతతో హైదరాబాద్‌ కు తరలివచ్చాయన్నారు. ఈ రంగంలో కొత్త గా 2.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు నయాపైసా ఇవ్వలేదన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్‌ తేల్చిచెప్పిందని, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తమ పని తాము చేసుకు పోతున్నామన్నారు. అందుకే దేశంలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top