మట్టిలో మాణిక్యం.. మర్రి చెన్నారెడ్డి

Marri Chennareddy 'The Country is More Important than the Person, Believe it. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంచి డాక్టర్‌గా రాణిస్తున్నప్పుడు వృత్తిని వదిలి రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్నేహితులు, మేనమామ రంగారెడ్డి స్వాగతించలేకపోయారు. చెన్నారెడ్డి మాత్రం ‘వ్యక్తి కంటే దేశం ముఖ్యం, పరతంత్య్రం కంటే స్వాతంత్య్రం శ్రేయస్సు’ అని నమ్మారు. గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు.

పదవులు... బాధ్యతలు
చెన్నారెడ్డి 1950లో ప్రొవిషనల్‌ పార్లమెంట్‌ సభ్యులుగా, కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా పనిచేశారు. ఆయన 1952 అసెంబ్లీ ఎలక్షన్‌లో గెలిచి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రిగా పదవి చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత 1962లో సంజీవరెడ్డి, 1964లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కీలకమైన పోర్టుఫోలియోలు నిర్వహించారు. తెలంగాణా రీజినల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్, ఎస్టిమేట్స్‌ కమిటీ చైర్మన్, రీహాబిలిటేషన్‌ కమిటీ చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్‌ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఉక్కు సాధకుడు
చెన్నారెడ్డి రాజకీయ పరిపక్వతను గమనించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, 1967లో ఆయనను రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేయడంతోపాటు ఉక్కు గనుల శాఖ మంత్రిగా నియమించారు. ఆ సమయం లోనే దక్షిణ భారతానికి మూడు ఉక్కు పరిశ్రమలను తెచ్చారు. ఓ ఏడాది తర్వాత కేంద్ర మంత్రి పదవి వది లేసి  తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. 

టీపీఎస్‌ స్థాపన
తెలంగాణ ఉద్యమానంతరం చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) స్థాపించి 1971లో పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఆయన మీద అనర్హత ఉన్న కారణంగా పోటీ చేయలేకపోయారు. తన అనుచరులను నిలబెట్టి 14 స్థానాల్లో 10 స్థానాలను కైవసం చేసుకొని కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత కొంతకాలానికి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం 1977 లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

సీఎం చెన్నారెడ్డి..
ఇందిరాగాంధీ 1978లో కాంగ్రెస్‌ (ఐ) పార్టీని స్థాపించినప్పుడు మర్రి చెన్నారెడ్డి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీకి 180 అసెంబ్లీ స్థానాలను సాధిం చి ఏపీకి ముఖ్య మంత్రి బాధ్యత లు చేపట్టారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆ    పదవిలో 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ఉన్నారు. రెండో దఫా 1989 డిసెంబర్‌ నుంచి 1990 డిసెంబర్‌ వరకే ఉన్నారు. ఆయన వికారాబాద్, మేడ్చల్, తాం డూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. చివరి ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి గెలిచారు. 1984 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన ‘నేషనల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ను స్థాపించి కరీంనగర్‌లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి జె.చొక్కారావు చేతిలో ఓడిపోయారు. ఆయన ఓటమిని చూసిన ఎలక్షన్‌ అదొక్కటే. ఆయన రాజకీయ జీవితంలో గవర్నర్‌గా ఉన్న కాలమే ఎక్కువ. నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌ బాధ్యతలు నిర్వర్తించిన చెన్నారెడ్డి డెబ్బై ఏడేళ్ల వయసులో 1996 డిసెంబర్‌ 2న మరణించారు.

రైతు కుటుంబం..
మర్రి చెన్నారెడ్డిది రైతు కుటుంబం. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి శంకరమ్మ. మర్రి చిన్నప్పటి పేరు అచ్యుతరెడ్డి. ఆయన తాత కొండా చెన్నారెడ్డి (తల్లి తండ్రి). ఆ చెన్నారెడ్డి పోయిన తరువాత, తండ్రి పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు శంకరమ్మ. మేనమామ కొండా వెంకట రంగారెడ్డి చెన్నారెడ్డిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చదివించారు. మెట్రిక్యులేషన్‌ ఉన్నతశ్రేణిలో పాసయ్యి, స్కాలర్‌షిప్, మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నారాయన. విద్యార్థి నేతగా రాణించారు. ఎంబీబీఎస్‌ పట్టా తీసుకుని, రెండు నర్సింగ్‌హోమ్‌లు పెట్టి వైద్య వృత్తి చేపట్టారు. 

పుట్టింది: 1919, జనవరి 13
స్వగ్రామం: వికారాబాద్‌ జిల్లా, మర్పల్లి మండలం, సిరిపురం
విద్యాభ్యాసం: ఎంబీబీఎస్‌ (1941)
రాజకీయ ప్రవేశం: 1935లో 
గవర్నర్‌గా: నాలుగు రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్‌)
ఉద్యమ సారధి: తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపన(టీపీఎస్‌)

– సురేఖ శ్రీనివాస్‌ మాచగోని, వికారాబాద్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top