చంద్రబాబుకు మమత బ్రేకులు

Mamata Banerjee Brakes for Chandrababu - Sakshi

ఫలితాలకు ముందే కూటమి పార్టీల సమావేశానికి నిరాకరణ

మాయావతి, అఖిలేష్‌ సైతం అనాసక్తి

రౌండ్‌ టేబుల్‌ సమావేశం దాదాపు లేనట్లే  

సాక్షి, అమరావతి: ఫలితాలు రాకముందే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ హడావుడి చేస్తున్న చంద్రబాబుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బ్రేకులు వేశారనే సమాచారం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలకు రెండురోజుల ముందు బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం నిర్వహించాలనే చంద్రబాబు ప్రతిపాదనకు ఆమె నిరాకరించినట్లు సమాచారం. బీఎస్పీ అధినేత్రి మాయవతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సైతం సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ సమావేశం దాదాపు లేనట్లేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో బీజేపీని వ్యతిరేకించే 22 పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చూచాయగా ఆయన తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలకంగా మారినట్లు, కాంగ్రెస్, మిగిలిన పార్టీలను సమన్వయం చేసి ముందుకు నడిపిస్తున్నట్లు, ప్రధాని అభ్యర్థిని తానే నిర్ణయిస్తానన్నట్లు కొద్దిరోజులుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన అనుచరవర్గం ఇంకా అత్యుత్సాహంతో చంద్రబాబు కాబోయే ప్రధాని అని ఒకసారి, ప్రధానిని ఆయనే నిర్ణయిస్తారని మరొకసారి చెప్పుకుంటూ నానా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. 

ఫలితాలకు ముందే భేటీలతో ఉపయోగమేమిటి?
ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఈ ప్రతిపాదనపై చంద్రబాబు చర్చించారు. ఆ తర్వాత బెంగాల్‌ వెళ్లి మమతకు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సమావేశం గురించి ప్రస్తావించినట్లు టీడీపీ నేత ఒకరు తెలిపారు. అయితే మమతా బెనర్జీ ఈ సమావేశానికి తాను రాలేనని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఫలితాలకు ముందు ఢిల్లీలో జరిపే భేటీల వల్ల ఉపయోగం ఏముంటుందని, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలిసిన తర్వాత వ్యూహాలు రూపొందించుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలిసింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా ఈ సమావేశం పట్ల అనాసక్తి చూపారని సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా ఫలితాలకు ముందు ఇలాంటి సమావేశాలు ఎందుకని ప్రశ్నించడంతో చంద్రబాబు నిర్వహించాలనుకున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రశ్నార్థకమైంది.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మద్ధతుగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే అనుమానం ఉండడం వల్లే మమత, మాయావతి తదితరులు దానికి అంగీకరించలేదనే ప్రచారం ఢిల్లీ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు ఢిల్లీ ఆసరా కోసం తపిస్తున్న చంద్రబాబు రాహుల్‌గాంధీ ప్రాపకం కోసం, తాను చక్రం తిప్పుతున్నట్లు బిల్డప్‌ ఇచ్చుకునేందుకు ఇలాంటి ప్రతిపాదనలు పెడుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తన ప్రతిపాదనకు మమత, మాయవతి అంగీకరించకపోయినా తుది దశ ఎన్నికలు జరిగే లోపు మరోసారి ఢిల్లీ వెళ్లి మిగిలిన పార్టీలను కలిసి ఈ సమావేశం ఏర్పాటు గురించి చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చివరి ప్రయత్నంగా ఢిల్లీ వెళ్లినా ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన నిర్వహించాలనుకున్న సమావేశం జరిగే అవకాశాలు దాదాపు లేవని చెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top