దేశంలో ధనిక ఎంపీ ‘కింగ్’ మహేంద్ర!

Mahendra Prasad Is One Of The Richest Indian MP - Sakshi

రూ.4,039 కోట్ల ఆస్తులతో జేడీయూ నేత రికార్డ్

211 దేశాల్లో పర్యటించిన ఏకైక ఎంపీ

సొంత వాహనం లేని అత్యంత సంపన్నుడు

సాక్షి, పాట్నా : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటిస్తున్న నేపథ్యంలో అత్యంత సంపన్న నేతగా జేడీయూ (బిహార్‌)కు చెందిన మహేంద్ర ప్రసాద్ నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న జయా బచ్చన్‌ రూ.1000 కోట్ల ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించి ధనిక ఎంపీగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్స్ పరిశీలన పూర్తికాగా రూ.4,039 కోట్ల ఆస్తులతో జేడీయూ అభ్యర్థి, ఎంపీ మహేంద్ర అగ్రస్థానంలో నిలిచారు. దాంతో సంపన్న ఎంపీల జాబితాలో జయా బచ్చన్ రెండో స్థానానికి పడిపోయారు. 58 స్థానాల కోసం మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు.

జేడీయూ తరఫున మూడోసారి రాజ్యసభకు వెళ్లనున్న మహేంద్ర ప్రసాద్ ఓవరాల్‌గా ఏడోసారి ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. కింగ్ మహేంద్రగా పేరు గాంచిన మహేంద్ర ప్రసాద్.. తన అఫిడవిట్‌లో రూ.4,010.21 కోట్ల చరాస్తులు, రూ. 29 కోట్ల స్థిరాస్తులు కలిగిఉన్నట్లు వెల్లడించారు. మాప్రా లాబోరేటరిస్ ప్రైవేట్ లిమిటెడ్, అరిస్టో ఫార్మాసూటికల్స్ కు అధిపతిగా ఉన్నారు. 

సొంత వాహనమే లేని ధనిక ఎంపీ
నాలుగు వేల కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా ఉన్న మహేంద్రకు ఒక్క వాహనం కూడా లేదని తెలిపారు. తన పేరుతో ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తొలిసారి 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టిన మహేంద్ర ప్రసాద్.. తాజాగా ఏడోసారి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. జేడీయూ నుంచి బరిలో నిలిచారు. 211 దేశాల్లో పర్యటించిన ఏకైక ఎంపీగా ఆయనదే రికార్డ్.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top