ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానం

Maharashtra Governor Bhagat Singh Koshyari Invited BJP - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. నవంబర్‌ 11 తేదీలోపు (సోమవారం) అసెంబ్లీలో బలన్ని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌ నుంచి ఓ ప్రకటన వెలువడింది. కాగా ఫలితాలు విడుదలై 15 రోజులకుపైగా గడుస్తున్నా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయం తెలిసిందే. సీఎం పీఠం, పదవుల పంపకాలపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ పదవీకాలం ఈనెల 8న ముగియడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి తొలుత అవకాశం ఇవ్వాలి కాబట్టి గవర్నర్‌ వారిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలు తన సంప్రదింపుల్లోనే ఉన్నారని దేవేంద్ర ఫడ్నవిస్‌ భావిస్తున్నారు. దీంతో వీరితో పాటు మరో 24 మందిని ఎలాగైనా తమవైపు తిప్పుకుని అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. గవర్నర్‌ కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో కీలక పరిణామాలు చేటుచేసుకునే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top