నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా: పిన్నెల్లి

Macherla MLA Pinnelli Rama Krishna Reddy Reacts On Bonda Uma Challenge - Sakshi

బోండా ఉమా సవాల్‌పై స్పందించిన మాచర్ల ఎమ్మెల్యే

సాక్షి, గుంటూరు : టీడీపీ నేత బోండా ఉమా సవాల్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీటుగా స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పల్నాడు ప్రజలను బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు కాదని బోండా ఉమా తెలుసుకోవాలి. విజయవాడ గల్లీలో రౌడీయిజం చేసినట్లు పల్నాడులో చేస్తామంటే కుదరదు. మాచర్ల మళ్లీ వస్తానని సవాల్‌ చేయడం కాదు, దమ్ముంటే రావాలి. లేదా నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదు. ఈ విషయంలో ఎక్కడదాకా వెళ‍్లడానికి అయినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు. (కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి)

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. (బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?)

కాగా బోదిలవీడులో రెండు వర్గాల కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు సోమవారం రాత్రి  వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్ధేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చూడగా మార్గమధ్యలో మాచర్ల వద్దే స్థానికంగా జరిగిన ప్రమాదంతో ఘర్షణ జరిగింది. (స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top