మళ్లీ కేజ్రీవాల్‌ వర్సెస్‌ ఎల్జీ

Lt Governor Dismisses Pair Of Team Kejriwal's COVID-19 Orders - Sakshi

ఆప్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన ఎల్జీ అనిల్‌ బైజాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)ల మధ్య మరో వివాదం తలెత్తింది. రెండు రోజుల క్రితం ఆప్‌ ప్రభుత్వం ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఎల్జీ అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఢిల్లీ వాసులైన కోవిడ్‌–19 రోగులకు మాత్రమే చికిత్స అందించాలని, కోవిడ్‌–19 లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు జరపాలని పేర్కొంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు 6న ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

అయితే, ఈ ఆదేశాలను తోసిపుచ్చుతూ ‘అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, నర్సింగ్‌హోమ్స్‌ల్లో స్థానికుడా? స్థానికేతరుడా? అనే వివక్ష చూపకుండా అందరు కోవిడ్‌–19 పేషెంట్లకు చికిత్స అందించాలి’ అని స్పష్టం చేస్తూ ఎల్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కరోనా లక్షణాలున్నవారికే పరీక్షలు జరపాలనడం ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తే..కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కష్టమవుతుందని, కరోనా మరింత ప్రబలుతుందన్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు మొత్తం 9 కేటగిరీల వారికి పరీక్షలు జరపాల్సిందేనన్నారు. ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ హోదాలో ఎల్జీ అనిల్‌ బైజాల్‌ ఆ ఆదేశాలిచ్చారు. ఎల్జీ తీరుపై ఆప్‌ మండిపడింది. బీజేపీ ఒత్తిడితోనే ఎల్జీ అలా వ్యవహరిస్తున్నారని, బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top