మౌనం వీడిన అడ్వాణీ | LK Advani's Message To BJP On Democracy Within Party | Sakshi
Sakshi News home page

మౌనం వీడిన అడ్వాణీ

Apr 5 2019 4:47 AM | Updated on Apr 5 2019 4:47 AM

LK Advani's Message To BJP On Democracy Within Party - Sakshi

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ టికెట్‌ నిరాకరించిన తర్వాత తొలిసారిగా బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అడ్వాణీ మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపక దినాన్ని (ఏప్రిల్‌ 6వ తేదీ) పురస్కరించుకుని గురువారం ఆయన ‘మొదట దేశం– ఆ తర్వాత పార్టీ– ఆఖరున వ్యక్తిగతం’ శీర్షికన సుమారు 500 పదాలతో క్లుప్తంగా తన బ్లాగ్‌లో స్పందించారు. ‘బీజేపీలో ఉన్న మనమంతా గతం, భవిష్యత్తుపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కీలక సందర్భమిది.

1991 నుంచి ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. రాజకీయంగా విభేదించిన వారిని బీజేపీ ఎన్నడూ కూడా శత్రువుగా చూడకుండా ప్రత్యర్ధిగా మాత్రమే భావించింది. పార్టీ స్థాపించిన మొదటి నుంచీ ఇదే వైఖరి అవలంబించింది. ఏకీభవించని రాజకీయ విరోధులను జాతి వ్యతిరేకులుగా చూడరాదన్నది పార్టీ జాతీయవాద భావన’ అని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ప్రతి పౌరుడూ తనకు ఇష్టానుసారం వ్యవహరించే హక్కు ఉందన్న సిద్ధాంతానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు.

‘పార్టీ లోపల, జాతీయ స్థాయి నిర్మాణంలోనూ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణ బీజేపీ గర్వించదగిన లక్షణాల్లో ఒకటి. అందుకే స్వాతంత్య్రం, సమగ్రత, నిజాయతీ, అన్ని రాజ్యాంగ సంస్థల పరిరక్షణలో బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండగవంటివి. మన ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన రాజకీయ పార్టీలు, మీడియా, ఎన్నికల అధికార యంత్రాంగం.. అన్నిటికంటే ముఖ్యంగా ఓటర్లు ఈ సందర్భంగా నిజాయతీతో కూడిన ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని అన్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత బ్లాగ్‌ ద్వారా స్పందించడం గమనార్హం.

అడ్వాణీజీ చక్కగా చెప్పారు: మోదీ
సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ సిద్ధాంతాల సారాన్ని ఆయన చాలా స్పష్టంగా వివరించారని చెప్పారు. ‘బీజేపీ వైఖరిని అడ్వాణీజీ చాలా స్పష్టంగా విశదీకరించారు. ‘మొదట దేశం, తర్వాత పార్టీ, అంతిమం వ్యక్తిగతం’ అంటూ అందరికీ ఆదర్శవంతమైన నినాదమిచ్చారు. పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేసిన ఎల్‌కే అడ్వాణీ వంటి మహా నేతలున్న బీజేపీలో కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అడ్వాణీ బ్లాగ్‌ లింక్‌ను కూడా అందులో షేర్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement