
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి కలల రాజధాని అమరావతి అని.. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు చంద్రబాబు ప్రాణాలు అమరావతిలో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. అందుకే అమరావతిలో భూములపై విచారణంటే టీడీపీ నేతలు హడలిపోతున్నారని విమర్శించారు. పతనావస్థలో ఉన్న టీడీపీని బతికించుకునేందుకు, చంద్రబాబు కృత్రిమ పోరాటాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు.
రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన బిల్లులపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలకు టీడీపీ అనుకూల మీడియా వంతపాడుతోందన్నారు. తన రాజకీయ జీవితంలో వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు ప్రజల కోసం జోలె పట్టని చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో భూదందాల కోసం జోలె పట్టడాన్ని కన్నబాబు తప్పుపట్టారు. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ చేస్తున్న వాదనల్లోని డొల్లతనాన్ని ఎండగట్టినతీరు ఆయన మాటల్లోనే..
విశాఖలో మావోయిస్టుల ప్రాబల్యమా?
విశాఖపట్నం మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతమని..పరిపాలన రాజధానిగా వద్దని టీడీపీ తమ అనుకూల మీడియాలో రాయిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డిని మావోయిస్టులు హైదరాబాద్ సమీపంలోనే హత్య చేశారు. మరి అప్పుడు హైదరాబాద్ నుంచి రాజధానిని మార్చేశారా.. శ్రీకాకుళం జిల్లాలోనే నక్సల్బరీ ఉద్యమం పుట్టడానికి అక్కడి వెనుకబాటుతనమే కారణం.