సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

Kumaraswamy Govt in Trouble With Supreme Court Verdict - Sakshi

సుప్రీం తీర్పుతో ఇబ్బందికర పరిణామం

సాక్షి, బెంగళూరు: రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయాధికారమని స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితిలో రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను ఆదేశించలేమని తెలిపింది. తద్వారా రాజ్యాంగబద్దమైన శాసన సభాపతి పదవిని సుప్రీంకోర్టు గుర్తించినట్టు అయింది. 

స్పీకర్‌ కోర్టులోకి బంతి
రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాపై సుప్రీంకోర్టు తీర్పుతో బంతి స్పీకర్‌ కోర్టులోకి వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో రాజీనామాలపై కర్ణాటక శాసనసభాపతి రమేశ్‌కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. మొత్తంగా 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు.. సంకీర్ణ సర్కారుకు మనుగడకు పెనుగండంగా మారాయి. ఈ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారా? లేక వారిపై అనర్హత వేటును వేస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్‌ మొదట రాజీనామాల అంశాన్ని చేపడతారా? లేక అనర్హత వేటుకు మొగ్గు చూపుతారా? అన్నది వేచిచూడాలి. లేక, రాజీనామాలపై ఆయన నాన్చివేత ధోరణి అవలబించినా? అవలంబించవచ్చు. అయితే, గురువారం జరగబోయే బలపరీక్ష అన్ని రకాలుగా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. ఒకవేళ స్పీకర్‌ ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే.. అది బీజేపీకి లాభించే అంశం. అలా కాకుండా రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా.. అది కుమారస్వామి ప్రభుత్వానికి ఏ మేరకు మేలు చేయకపోవచ్చు. ఎందుకంటే, రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడింది. 

అలా కాకుండా రెబెల్‌ ఎమ్మెల్యేలు రేపటి బలపరీక్షకు దూరంగా ఉన్నా.. అది కూడా బీజేపీకే మేలు చేస్తుంది. అసెంబ్లీకి హాజరు కావడం రెబెల్‌ ఎమ్మెల్యేల ఇష్టమని, సభకు హాజరుకావాలని వారిని ఎవరూ బలవంతపెట్టలేరని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా.. సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. 

కర్ణాకట అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా 16 మంది రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదిస్తే సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105కు చేరుతుంది. ప్రస్తుతం అసెం‍బ్లీలో బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కలపుకొని 107 మంది సభ్యుల బలముంది. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 80కాగా, 13మంది రాజీనామా చేశారు. జేడీఎస్‌ సభ్యుల సంఖ్య 37 కాగా, ముగ్గురు రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం సంకీర్ణ కూటమి సంఖ్యాబలం 101 మాత్రమే. ఈ నేపథ్యంలో ఒకవైపు సుప్రీంతీర్పు స్వాగతిస్తున్నామని కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించగా.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నామని బీజేపీ నేత యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top