కేంద్రం తీరువల్లే సమస్యలు

KTR meeting with Cantonment Board members - Sakshi

కంటోన్మెంట్‌ బోర్డు మెంబర్లతో కేటీఆర్‌ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: వివిధ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర రక్షణ శాఖ అవలంబిస్తున్న వైఖరివల్లే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కంటోన్మెంట్‌ ప్రాంత అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా.. బోర్డు, రక్షణ శాఖ ఆంక్షలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఎమ్మెల్యే సాయన్నతో పాటు, కంటోన్మెంట్‌ బోర్డులో టీఆర్‌ఎస్‌ సభ్యులతో తెలంగాణ భవన్‌ లో బుధవారం కేటీఆర్‌ సమావేశమయ్యారు.

జంటనగరాల పరిధిలో స్కైవేల నిర్మాణానికి కేం ద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో కంటోన్మెంట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తీరడం లేదన్నారు. స్కైవేల నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలు మార్లు కేంద్రానికి వినతులు సమర్పించినా స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కంటోన్మెంట్‌ బోర్డు నుంచి సహకారం లభించడం లేదని, బోర్డు లోని టీఆర్‌ఎస్‌ సభ్యులు కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. రామన్నకుంట చెరువులోకి మురికినీరు చేరకుండా రూ. రెండున్నర కోట్లతో రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

బోర్డు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం 
కంటోన్మెంట్‌ బోర్డుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధిస్తారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. బోర్డు పాలక మండలి ఎన్నికలను పార్టీ చిహ్నాలతో నిర్వహించేలా కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే సాయన్న కేటీఆర్‌ను కోరారు. సమావేశంలో టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌ చిరుమిల్ల రాకేశ్, టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top