కోమటిరెడ్డి అనుచరుల ఆనందం | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి అనుచరుల ఆనందం

Published Wed, Apr 18 2018 1:12 PM

Komati reddy Venkat reddy Activists Celebrate Court Judgement - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : రెండు నెలలపాటు రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన అనుచర వర్గం సంబరాలు చేసుకుంది. గత నెల తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో చోటు చేసుకున్నపరిణామాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోమటిరెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గం పరిధిలోనే కాకుండా జిల్లాలో వివిధ మండలాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నాయి.

రెండు నెలలుగా అధికారికకార్యక్రమాలు లేకుండా..
కోమటిరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడంతో రెండు నెలలుగా ఆయన ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొనకుండా అయ్యారు. అంతేకాకుండా ఆయనకు ఉన్న గన్‌మెన్లను కూడా రద్దు చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఖాయమంటూ అధికార టీఆర్‌ఎస్‌ వర్గాలు హడావిడి చేశాయి. సభ్యత్వ వివాదంపై కేసు వాదనల్లో ఉన్నందున ఆరు వారాల వరకు ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించవద్దని కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతోనే నల్లగొండ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్న వార్తలకు తెరపడింది. ఈ కేసు విషయంలోనే రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ కూడా రాజీనామా చేయడంతో అధికార పార్టీ ఇరుకున పడింది. ఇప్పుడు ఏకంగా స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం సరికాదని, కోమటిరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇది తమ గెలుపుగా కోమటిరెడ్డి, ఆయన అనుచరులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ సంబరాలు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే పదవిలో కొనసాగించాలని, ఆయన సభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు జిల్లాలో వివిధ మండలాల్లో సంబరాలు చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలో కోమటిరెడ్డి ఇంటినుంచి క్లాక్‌ టవర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో టపాసులు పేల్చారు. నకిరేకల్‌ నియోజకవర్గం శాలిగౌరారం, నార్కట్‌పల్లి, మునుగోడు నియోజకవర్గ కేంద్రం, చండూరులో, నల్లగొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. అదే విధంగా కొండమల్లేపల్లి, చింతపల్లిలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.  నల్లగొండలో తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేశారని, కానీ, న్యాయం తమవైపు ఉన్నందునే హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని ఆయన అనుచరుడు, నల్లగొండ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement