ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం

Kodandaram Comments In Medachal Public Meeting - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : తెలంగాణ రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు రావటం తెలంగాణ ప్రజల అదృష్టమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 9 నెలల ముందే గద్దె దిగిన  కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్‌కు ఓటు వేసినా ఫాంహౌసే, వేయకపోయినా ఫాంహౌసే అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు వేసిన ప్రతి ఓటు బురద గుంటలోకి వెళుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి బతుకు దెరువు దొరకాలని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వలేదన్నారు.

ప్రతి వర్గానికి న్యాయం జరగాలని.. తాము సంఘటితంగా బయలు దేరామని, అందరం కలిసి నిలబడతామని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ కోట్ల రూపాయలు వెదజల్లుతోందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్‌ 25 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాలలో మద్దతు ధర అడిగినందుకు రైతుల చేతికి బేడీలు వేశారని, ఇసుక మాఫియాను ఆపినందుకు దళితులను విచ్చలవిడిగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో రేషన్‌ డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం కూడా పెంచలేదన్నారు. కేసీఆర్‌ది నిరంకుశ, నియంతపాలన.. నిరంకుశ పాలనకు సమాధి కట్టేందుకు అందరూ కూటమికే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు :
‘కేసీఆర్‌ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు’

దానికోసమే సోనియా గాంధీ వచ్చారు : రేవంత్‌ రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top