కదిలించిన పిల్లాడి వీడియో

Kodagu Boy Slams CM Kumaraswamy Goes Viral - Sakshi

సోషల్‌ మీడియా.. ఎలాంటి పోరాటానికైనా ఇప్పుడు అదో ఆయుధంగా మారిపోయింది. పోస్టులు, ఫోటోలు, వీడియోలు... ఇలా ఏదైనా సరే చిన్నగా మొదలై పెను ఉద్యమ రూపుదాలుస్తున్నాయి.  తాజాగా కర్ణాటకలో ఓ బాలుడి వీడియో.. సోషల్‌ మీడియాను ఉపేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామినే ఉక్కిరి బిక్కిరి చేసేసింది. 

బెంగళూరు: భారీ వర్షాలతో కొడగు జిల్లా అంతా అతలాకుతలంగా మారిపోయింది. దీంతో ఎనిమిదో తరగతి చదువుతున్న కలేరా ఫతే అనే పిల్లాడు.. బడ్జెట్‌లో తమ(కొడగు) ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ ఓ వీడియో చేశాడు. ‘కావేరీ జన్మస్థలం కొడగు. భారీ వర్షాలు పడితే కావేరీ జలాలతో మాండ్యా, మైసూర్‌, చివరకు మద్రాస్‌ సహా అన్నీ ప్రాంతాలు లాభపడతాయి. అలాంటిది కొడగునే మీరు(కుమాస్వామిని ఉద్దేశించి..) అనాథలా వదిలేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇక్కడ పంటలు నీట మునిగాయి. ఏనుగులు అడవులు దాటి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రోడ్లు చిధ్రం అయిపోయాయి. కానీ, మీరు చేసింది మాములు మోసం కాదు. బడ్జెట్‌లో ఎలాంటి గ్రాంట్లు ఇవ్వలేదు. ఇది మమల్ని దారుణంగా నిరాశపరిచింది’ అంటూ వీడియోను రూపొందించాడు. 

యెడ్డీని వదల్లేదు... ఇదే వీడియోలో కలేరా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను కూడా ఏకీపడేశాడు. ‘యడ్యూరప్పగారు.. మీరు విధాన సభ లోపల, బయట ప్రభుత్వంపై అరవటం కాదు. సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లండి. ప్రధాని మోదీని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయండి’ అంటూ పేర్కొన్నాడు. వర్షంలో ఓ గొడుగుతో నది ఒడ్డున్న ఉండి చేసిన కలేరా చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

స్పందించిన కుమారస్వామి.. ఇదిలా ఉంటే వైరల్‌ అయిన ఈ వీడియో గురించి మీడియా సీఎం కుమారస్వామి వద్ద ప్రస్తావించింది. ‘ఇది 70 ఏళ్ల సమస్య. రెండు నెలల క్రితమే మొదలైందా? నేను సీఎం బాధ్యతలు స్వీకరించగానే గుర్తొచ్చిందా? విమర్శలను మా ప్రభుత్వం పట్టించుకోదు.  కానీ, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇలాంటివి చూపించి ఎంత కాలం నన్ను నిరుత్సాహపరుస్తారు?. నన్ను మొదలుపెట్టనివ్వండి. నేనేం అసెంబ్లీలో ఖాళీగా కూర్చోట్లేదు. ప్రజల మధ్యే సమయం గడిపేందుకు యత్నిస్తా. త్వరలోనే కొడగును సందర్శిస్తా. స్థానిక ఎమ్మెల్యేతో ఇప్పటికే ఈ విషయంపై చర్చించా. కావాలంటే రెండురోజులు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తా’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top