
ఒంగోలు సబర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన బాగుందని, ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుపోతున్నారని చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో వైఎస్ జగన్ ముందుకుసాగుతున్నారని తెలిపారు. ఒంగోలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
► తన ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయి.
► అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల సచివాలయ ఉద్యోగాలిచ్చిన ఏకైక సీఎంగా పేరుతెచ్చుకున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంది.
► కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సంక్షేమ పథకాల అమలు అసాధ్యమని చెప్పినా.. వాటిని ప్రజలకు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది.
► దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తున్నారు.. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నారు..
ప్రాజెక్టుల విషయంలో బాబు శ్రద్ధచూపలేదు
► వెలిగొండ ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం. ప్రాజెక్టు విషయంలో ఆయన శ్రద్ధ చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కనీసం నాయకుల్లో కూడా నమ్మకం కలిగించలేకపోయారు. తప్పులు దిద్దుకోలేకపోయారు.
► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది.
► వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కావాలనే విమర్శలు చేస్తున్నారు.. అయినా వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదు.
► టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు నేరుగా సీఎం జగన్‌కు, మరికొందరు మంత్రులకు టచ్‌లో ఉన్నారు. వారు వైఎస్సార్‌సీపీలో చేరే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది.. అని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణం బలరాం చెప్పారు.