‘ఆంధ్ర అపరిచితుడి మాటలు నమ్మకండి’

Kanna Lakshmi Narayana Take Charge As AP BJP President - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే గజదొంగను మించిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు అద్దె మైకు లాంటివారని ఎద్దేవా చేశారు. అవినీతి అరాచకం తప్ప నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.

‘చంద్రబాబు నిన్న చేసింది నవనిర్మాణ దీక్ష కాదు నయవంచన దీక్ష. మూడు దీక్షల్లో కాంగ్రెస్‌ను తప్పుబట్టిన చంద్రబాబు ఈ దీక్షలో తన నిజరూపాన్ని బయట పెట్టుకున్నారు. రాహుల్ గాందీ ప్రాపకం కోసం మోదీ, అమిత్‌ షాలను విమర్శిస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ అవినీతి రహిత పాలన సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారు.156 సంక్షేమ పథకాలను మోదీ అమలు చేసి.. అన్ని వర్గాల వారికి చేయూతను ఇచ్చారు.చంద్రబాబు ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఏపీలో అసమర్థ పాలన, పోలీసు రాజ్యం సాగుతుంది. న్యాయం చేయాలని ఎవరైనా బయటకు వస్తే వారిని బెదిరిస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారు. టీడీపీ నాయకులు మట్టి, ఇసుక, భూకబ్జా మాఫియాలకు పాల్పడుతున్నారు.

ఆంధ్ర రాష్ట్ర అపరిచితుడు మాటలను నమ్మొద్దు. ఆయన చరిత్ర మొత్తం మోసపూరితం, కుట్ర పూరితం, వెన్నుపోట్లు. దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్ర మోసం చేసిందని చెప్పిందా? ఎన్డీఏలో ఉంటూ కుట్రలు చేసి బీజేపీపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. విభజన బిల్లులో చాలా అంశాలను కేంద్రం అమలు చేసింది. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్లుగా చంద్రన్న బీమా పధకానికి కేంద్రం ఇచ్చే నిధులు వాడుకుంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో పార్టీల మధ్య అక్రమ సంబంధాలు అంటకడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే జనాల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పాలి. చంద్రబాబు చేసిన కుట్రలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయానికి కృషి చేస్తా. ఇంటింటికి బీజేపీ పేరుతో యాత్రలు చెపడతాం. బిజెపి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి.. మేము చేసిన అభివృద్ధి ని ప్రజలకు వివరిస్తామ’ని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top