‘బిల్లుకు మద్దతు తెలుపకపోతే కర్రు కాల్చి వాతపెడతారు’

K Laxman Comments On Ten Percentage Reservation to EBC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్థిక వెనుకబాటు ఆధారంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ కొనియాడారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలన్నీ అగ్రవర్ణ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలుపకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు దశాబ్దాల డిమాండ్ అని సామాజిక వివక్షకు సంబంధించిన రిజర్వేషన్లతో పాటు ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కూడా రిజర్వేషన్లు అవసరమన్నారు. ఈ సాహసోపేత నిర్ణయం అమలు చేసిన ఘనత మోదీనే అని తెలిపారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. అసదుద్దీన్ ది నోరా.. తాటి మట్టా? అని ఫైర్‌ అయ్యారు. సమాజంలోని అసమానతలు తొలగించడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లు ఇస్తే కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. 

అన్ని కోణాల్లో ఆలోచించి ఎలాంటి చిక్కులు రాకుండా ఉండే విధంగానే ఈ బిల్లు రూపొందించామని తెలిపారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల స్టంట్ కాదని, కాన్షీరామ్ కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. మాయావతి, ములాయం కూడా అగ్రవర్ణ రిజర్వేషన్లు సమర్ధించారని తెలిపారు. కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెడితే బీజేపీ ఎమ్మెల్యేలుగా అడ్డుకున్నామని, ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరామని తెలిపారు. మేము ఆనాడు చెపితే కేసీఆర్ కు అర్థం కాలేదు, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పెరిగిన 10శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయాలన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి పెరిగిన రిజర్వేషన్లను అమలు పరచాలన్నారు. సామాజిక వివక్షను, ఆర్థిక వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. సిన్హా కమీషన్ నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top