
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి 9: 30 నిమిషాల అనంతరం ఈ భేటీ జరుగనుందని.. బీజేపీ నేతలు ప్రకటన చేశారు. కాగా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 18 ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. వీరందరూ సింధియా అండతో రెబెల్ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే మోదీ, అమిత్ షాతో సింధియా భేటీ జరుగుతుండటం జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.