‘కమలా’ధీశుడు ఎవరో..?

JP Nadda and Bhupendra Yadav big contenders for BJPs new president - Sakshi

రేసులో ముందంజలో జేపీ నడ్డా, భూపేంద్ర యాదవ్‌  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఎవరు నియమితులవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉంటూనే అమిత్‌ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం ఉందని బీజేపీ సీనియర్‌ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవిలో ఉండాలనేది బీజేపీ సంప్రదాయం. కాబట్టి షా పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే అవకాశాలే ఎక్కువ.

బీజేపీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అమిత్‌ షా స్థానాన్ని మరొకరు భర్తీ చేసి, ఆయనలా పనిచేయాలంటే చాలా కష్టమైన పనే. అయితే కొత్త చీఫ్‌గా కాస్త తక్కువ వయసు ఉన్న అలాగే పార్టీ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి నియమితులు కావొచ్చనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజస్తాన్‌ వ్యక్తి భూపేంద్ర యాదవ్, అలాగే కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన జేపీ నడ్డాల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో సీనియర్‌ నాయకుడైన నడ్డాను మోదీ ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. గత ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే.

అలాగే పార్టీ అగ్రనాయకులు, ఆరెస్సెస్‌ ఆశీస్సులు నడ్డాకు బాగా ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైనందున, తగినంత అనుభవం కూడా నడ్డాకు ఉంది. మరోవైపు పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో అమిత్‌ షాకు భూపేంద్ర యాదవ్‌ ఎంతో సాయం చేస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమిత్‌ షా కూడా భూపేంద్ర యాదవ్‌ను బాగా నమ్ముతారు. గతేడాది గుజరాత్‌ శాసనసభ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్‌ గుజరాత్‌ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్‌ పేరు కూడా కొత్త చీఫ్‌ రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుసగా మహేంద్ర నాథ్‌ పాండే, నిత్యానంద్‌ రాయ్‌లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top