
సమావేశంలో మాట్లాడుతున్న రాజేందర్‌రెడ్డి
వరంగల్ , హన్మకొండ: టీఆర్‌ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలని సీఎం కేసీఆర్‌కు ఇప్పటికైనా అర్థమైందా అని కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం హన్మకొండ సర్క్యూట్ హౌస్ రోడ్డులోని విశాల్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలని తేల్చేశారని చెప్పారు.
తాము ఎప్పటి అభివృద్ధి కుంటుపడిందని, వరంగల్ నగరం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని చెబుతూ వస్తున్నా..తమ మాటలు పట్టించుకోకుండా, టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్లతో తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎదురు దాడి చేశారన్నారు. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ది జాడే లేదన్నారు. నగర సమస్యలపై త్వరలో మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ పెట్టిన ఫ్లెక్సీలను మొక్కుబడిగా తొలగించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, నెక్కొండ కిషన్, తోట వెంకన్న, గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, నేహాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.