కారణం చెప్పి.. రామన్న కంటతడి

Jogu Ramanna Comments About Telangana Cabinet Expansion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం మీడియా ముందుకు వచ్చిన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉండేనని, అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు. బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం తనకు లేదన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆరే తమ నాయకుడు అని రామన్న అన్నారు. 

(చదవండి : గులాబీ పుష్పక విమానం.. ఓవర్‌ లోడ్‌!)

కేసీఆర్‌ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే చాన్స్‌ దక్కింది. తొలిదఫా రాకున్నా..  విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. ఇటీవల ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో పెద్ద చిచ్చేపెట్టింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లబుచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top