
కరీంనగర్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వార్ధా ప్రాంతానికి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, ఇది ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్న టీఆర్‌ఎస్ నేతలు నాలుగేళ్లయినా తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించకుండా తెలంగాణ ప్రజల హక్కులను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
ప్రాణహితకు బదులుగా వార్ధానదిపై బ్యారేజీ నిర్మించడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మన్ను కూడా కాంగ్రెస్ పార్టీ తీయలేదని గగ్గోలు పెట్టిన టీఆర్‌ఎస్ నేతలు.. నాలుగేళ్లయినా మీరు ఏం చేశారో చెప్పాలన్నారు. బ్యారేజీ నిర్మాణంపై కొత్త ప్రతిపాదనలతో ప్రజలను మభ్యపెట్టిం చి తమ్మిడిహెట్టిని పెండింగ్ లో పెట్టేందుకు టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు.
నీళ్లులేని చోట బ్యారేజీలా?
తమ్మిడిహెట్టి వద్ద లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకొని అదనంగా లభ్యమయ్యే నీటి కోసం బ్యారేజీలు నిర్మించాల్సిందిపోయి, నీళ్లు లేని చోట నిర్మాణాలు చేపట్టడం ప్రజాధనాన్ని కొల్లగొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమేనని జీవన్‌రెడ్డి ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్దనే బ్యారేజీ నిర్మాణం తలపెట్టి సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, 6,7,8 టన్నెళ్ల ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిందేనని, లేనట్టయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు.