కేంద్రంకు కొత్త చిక్కు.. మరోచోట ప్రత్యేక డిమాండ్‌!

JDU Demands Bihar Special Status Demand be Taken Seriously - Sakshi

సాక్షి, పట్నా : ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర స్థాయి ఉద్యమం జరుగుతుండగా తాజాగా మరో రాష్ట్రంలో అదే డిమాండ్‌తో ఉద్యమం ప్రారంభం కానుంది. బిహార్‌లోని జేడీయూ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో కేంద్రంపై పోరాటానికి దిగనుంది. ఈ మేరకు జేడీయూ నేత కేసీ త్యాగి శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. 'ఈ మధ్య కాలంలోనే మా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా కేంద్రాన్ని తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. ఈ విషయంపై మేం పోరాటం కొనసాగిస్తాం' అని ఆయన అన్నారు. మహాగట్బంధన్‌ (జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కూటమి)నుంచి తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చిన జేడీయూ ఆ తర్వాత ఎన్డీయేతో పొత్తుపెట్టుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది.

పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో సీఎం నితీశ్‌ కుమార్‌ కోరారు. అయితే, ఆయన కేంద్రంలోని ఎన్డీయే మద్దతుతోనే మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ విషయం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అయితే, తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ డిమాండ్ మరోసారి బలంగా కేంద్రం ముందుకు తీసుకెళ్లాలని జేడీయూ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, ఎన్డీయేతో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటీగా బయటకు వెళ్లిపోతుండటంవంటి కారణాల దృష్ట్యా నితీశ్‌ సర్కార్‌ మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిహార్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ ముఖ్యమంత్రి నితీశ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోగానే ఆయన ప్రత్యేక హోదాను మరిచిపోయారంటూ ప్రతి చోట విమర్శిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top